ఇబ్రహీంపట్నం ఆగస్టు 18 ప్రజా జ్యోతి:
బహుజన రాజ్యాధికార సాధన కోసం పోరాడిన గొప్ప యోధుడు, మొగలాయి దౌర్జన్యాలను ఎదురించి తెలంగాణ ప్రాంత ప్రజల కోసం ధైర్యంగా పోరాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా మున్సిపాలిటీ చైర్మన్ టేకుల సుదర్శన్ రెడ్డి, సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాపన్న గౌడ్ కేవలం ఒక వీరుడు మాత్రమే కాకుండా, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన గొప్ప ప్రజా నాయకుడని కొనియాడారు. ఆనాటి సామాజిక పరిస్థితుల్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ప్రజల కోసం పోరాటం చేసిన ఆయన ధైర్యసాహసాలు, త్యాగాలు నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. తెలంగాణ ప్రాంత చరిత్రలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌కు ప్రత్యేక స్థానం ఉందని, ప్రజల స్వాభిమానాన్ని కాపాడేందుకు ఆయన చేసిన పోరాటాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పాపన్న గౌడ్ ఆశయాలు, సమాజంలో సమానత్వం కోసం ఆయన చేసిన కృషిని భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ శ్యామల భాస్కర్, కౌన్సిల్ సభ్యులు చిలుక బుగ్గ రాములు, కొండిగారి త్రిలోక్ కుమార్, గూడూరు గిరీష్, కొండ్రు శ్రీలత రాంబాబు, మంద జయ మహేష్, బీఆర్‌ఎస్‌వీ శివ సాయి తదితరులు పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌కు ఘనంగా నివాళులు అర్పించారు.








