Mahaa Daily Exclusive

  హైదరాబాద్‌లో 145 ‘ఆరోగ్య దీపిక’ పాలీక్లినిక్‌లు.

Share

• ఇంటి సమీపంలోనే ప్రత్యేక వైద్య సేవలు.
• పెద్దాసుపత్రులపై భారం తగ్గించేలా ప్రభుత్వ చర్యలు.
హైదరాబాద్‌, మహా.
హైదరాబాద్‌ నగర పరిధిలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘ఆరోగ్య దీపిక’ పేరుతో పాలీక్లినిక్‌లను అందుబాటులోకి తీసుకురానుంది. కోర్‌ అర్బన్‌ రీజియన్‌ పరిధిలో ఎంపిక చేసిన 145 కేంద్రాల్లో ఈ సేవలను ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే పలు బస్తీ దవాఖానాలను ఆధునిక వసతులతో అభివృద్ధి చేసి పాలీక్లినిక్‌లుగా తీర్చిదిద్దగా.. వాటిలో 40 కేంద్రాలు సేవలకు సిద్ధమయ్యాయి. మిగిలిన కేంద్రాల్లోనూ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
సనత్‌నగర్‌లో టిమ్స్‌ ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోగ్య దీపిక పాలీక్లినిక్‌ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నగరంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు ఇంటికి సమీపంలోనే వివిధ వైద్య నిపుణుల సేవలు అందించడంతో పాటు వ్యాధులను తొలిదశలోనే గుర్తించడం ఈ కేంద్రాల ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంటోంది.
పెద్దాసుపత్రులకు పరుగులు తగ్గేలా..
ప్రస్తుతం నగరంలో బస్తీ దవాఖానాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, శివారు ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందుతున్నాయి. జ్వరం, జలుబు, దగ్గు, అధిక రక్తపోటు, మధుమేహం వంటి సాధారణ ఆరోగ్య సమస్యలకు చికిత్సతో పాటు వివిధ రక్త పరీక్షలకు నమూనాల సేకరణ జరుగుతోంది.
అయితే ప్రత్యేక వైద్యుల సేవలు అవసరమైనప్పుడు రోగులను గాంధీ, ఉస్మానియా, నిలోఫర్‌ వంటి పెద్దాసుపత్రులకు పంపిస్తున్నారు. ఫలితంగా ఆయా ఆసుపత్రుల్లో రోగుల రద్దీ పెరుగుతోంది. ఈ పరిస్థితిని తగ్గించడంతో పాటు అవసరమైన వారికి ఇంటి సమీపంలోనే నిపుణుల వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో పాలీక్లినిక్‌లను ఏర్పాటు చేస్తున్నారు.
ఒకే చోట పలురకాల వైద్య సేవలు
ఆరోగ్య దీపిక పాలీక్లినిక్‌ల ప్రత్యేకత వివిధ విభాగాలకు చెందిన వైద్య నిపుణులు ఒకే కేంద్రంలో అందుబాటులో ఉండటమే. సాధారణ వైద్యంతో పాటు స్త్రీ వైద్యం, ఎముకలు–కీళ్ల వైద్యం, చర్మవ్యాధులు, చెవి–ముక్కు–గొంతు తదితర విభాగాలకు చెందిన వైద్యులు రోగులకు సేవలు అందించనున్నారు.
సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వైద్య నిపుణులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిరోజూ ఇద్దరు లేదా ముగ్గురు వైద్య నిపుణులు ఆయా కేంద్రాల్లో బాహ్య రోగుల సేవలు అందించేలా ప్రణాళిక రూపొందించారు.
వ్యాధిని ముందే గుర్తించే అవకాశం
పాలీక్లినిక్‌ల ద్వారా కేవలం చికిత్సకే పరిమితం కాకుండా వ్యాధులను తొలిదశలోనే గుర్తించేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అవసరమైన వారికి పరీక్షలు నిర్వహించి, మరింత ఉన్నత స్థాయి వైద్యం అవసరమైతే గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌, టిమ్స్‌ వంటి ఆసుపత్రులకు రిఫర్‌ చేయనున్నారు.
పాలీక్లినిక్‌ నుంచి సిఫారసుతో వచ్చే రోగులకు సంబంధిత పెద్దాసుపత్రుల్లో ప్రాధాన్యంతో వైద్యం అందించేలా వ్యవస్థను అనుసంధానం చేయనున్నారు. దీంతో రోగులు అవసరం లేకుండా పెద్దాసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తగ్గనుంది.
క్యాన్సర్‌ స్క్రీనింగ్‌పై ప్రత్యేక దృష్టి
మహిళల్లో రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ వంటి వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు ఆరోగ్య పరీక్షలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. చాలామంది వ్యాధి ముదిరిన తర్వాతే ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న నేపథ్యంలో.. పాలీక్లినిక్‌ల స్థాయిలోనే అనుమానిత కేసులను గుర్తించి అవసరమైన వైద్య పరీక్షలు, తదుపరి చికిత్సకు మార్గనిర్దేశం చేయడం ద్వారా వ్యాధి తీవ్రతను తగ్గించే అవకాశం ఉంటుందని వైద్య అధికారులు చెబుతున్నారు.
జాతీయ ఆరోగ్య కార్యక్రమాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చే నిధులతో ఈ పాలీక్లినిక్‌లను నిర్వహించనున్నారు. నగర ప్రజలకు అందుబాటులో, సమీపంలో, సమయానికి ప్రత్యేక వైద్య సేవలు అందించడం ద్వారా ప్రభుత్వ వైద్య వ్యవస్థపై నమ్మకాన్ని మరింత పెంచడంతో పాటు పెద్దాసుపత్రులపై రోగుల ఒత్తిడిని తగ్గించడమే ‘ఆరోగ్య దీపిక’ లక్ష్యంగా ప్రభుత్వం భావిస్తోంది.

Latest