Mahaa Daily Exclusive

  బావిలోకి దూసుకెళ్లిన కారు..! ఒకే కుటుంబంలో నలుగురు మృతి..

Share

  • బావిలోకి దూసుకెళ్లిన కారు
  • ఒకే కుటుంబంలో నలుగురు మృతి
  • సిద్దిపేట జిల్లా దుబ్బాకలో విషాదం

సిద్దిపేట, మహా : జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బావిలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో నలుగురు మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదం దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. మృతులంతా ఓకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బాక మండలంలోని బల్వంతాపూర్ గ్రామానికి చెందిన దండుగల రాజు, భాగ్య దంపతులకు కుమారుడు నిహాన్ష్, కుమార్తె శాన్విక సంతానం. వీరు పని మీద సిద్దిపేట వెళ్లగా.. బుధవారం అర్ధరాత్రి తర్వాత కారులో స్వగ్రామానికి బయల్దేరారు. అప్పనపల్లి శివారుకు రాగానే.. వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. అటుగా వెళ్తున్న వారు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత పోలీసులు అగ్ని మాపక సిబ్బంది సహాయంతో వారిని వెలికితీసే ప్రయత్నం చేశారు. జేసీబీతో బావిలో నుంచి కారును బయటకు తీయగా.. అప్పటికే నలుగురు మృతి చెందారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఓకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవటంతో వారి కుటుంబంలో, బల్వంతాపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Latest