- ముగ్గురి అరెస్ట్
- రూ.11,000 నగదు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం నేరానికి ఉపయోగించిన ఆటో సీజ్
- నిందితుల పై సస్పెక్ట్ షీట్లు దాఖలు చేసిన
సీఐ డి విశ్వేశ్వర్
వరంగల్ క్రైమ్ మహా;
గీసుగొండ మండలం ఊకల్ గ్రామ శివారులోని భారత్ పెట్రోల్ బంకులో చోరీకి పాల్పడిన ముగ్గురిని గీసుగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. కాజీపేటకు చెందిన కంది చరణ్, జక్కుల ప్రతాప్, గండికోట శివలను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ డి. విశ్వేశ్వర్ తెలిపారు. ఈ నెల 18న అర్ధరాత్రి నిందితులు పెట్రోల్ బంకు వద్దకు వెళ్లి మేనేజర్ కౌడగాని రాజగోపాల్ ను సీఎన్‌జీ పంపు గురించి ఆరా తీస్తూ రెక్కీ నిర్వహించారు. అనంతరం ఆయన నిద్రిస్తున్న సమయంలో బ్యాగులోని రూ.15,800 నగదును అపహరించి ఆటోలో పరారయ్యారు. యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. మరియాపురం శివారులో వాహన తనిఖీల సందర్భంగా అనుమానాస్పదంగా కనిపించిన ఆటోను ఆపి ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు సీఐ తెలిపారు. వారి నుంచి రూ.11 వేల నగదు, రెండు సెల్‌ఫోన్లు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి, సస్పెక్ట్ షీట్లు తెరవనున్నట్లు సీఐ పేర్కొన్నారు. కేసు ఛేదనలో ఎస్‌ఐ అనిల్‌కుమార్, కానిస్టేబుళ్లు అరవింద్, విజయ్, ప్రవీణ్, సాయి పాల్గొన్నారు.








