Mahaa Daily Exclusive

  ఫుడ్ పాయిజన్‌పై.. సర్కార్ సీరియస్..

Share

ఫుడ్ పాయిజనింగ్ పై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుసఘటనలపై ఫైర్ అయ్యారు. జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో పాటు బాధ్యులపై వేటు వేయాలని, మళ్ళీ రిపీట్ కాకుండా చూడాలని ఆదేశించారు. మరోవైపు రాష్ట్రంలోని గురుకులాలు, హాస్టళ్లలో ఇటీవల వరుసగా వెలుగుచూస్తున్న ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో కారణాలు తేల్చేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. ఒకదాని తర్వాత మరొకటిగా జరుగుతున్న ఈ సంఘటలన వెనుక కుట్రకోణం ఉందన్న అనుమానాన్ని ప్రభుత్వవర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కుట్ర నిగ్గుతేల్చేందుకు ప్రభుత్వం డిసైడైంది. కొందరు అధికారులు, వారి వెనుక కొందరు కుట్రదారులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఓ వైపు టాస్క్ ఫోర్స్, మరోవైపు విద్యాకమిషన్ ను కూడా రంగంలోకి దింపింది.

 

హైదరాబాద్, మహా: రాష్ట్రంలోని గురుకులాలు, హాస్టళ్లలో ఇటీవల వరుసగా వెలుగుచూస్తున్న ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఫుడ్ పాయిజన్కు కారణాలు తేల్చేందుకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ముగ్గురు సభ్యులు ఉండే ఈ కమిటీలో ఒక ఫుడ్ సేఫ్టీ కమిషనర్, ఓ అదనపు డైరెక్టర్, ఒక జిల్లా స్థాయి అధికారి ఉంటారు. గురుకులాలు, హాస్టళ్లలో ఆహార నాణ్యతను ఈ బృందం పరిశీలించనుంది. వీటితో పాటు అంగన్వాడీలు, ఆసుపత్రుల్లో ఆహార నాణ్యతనూ పర్యవేక్షించనుంది. ఫుడ్‌ పాయిజన్‌ జరిగినప్పుడు కారణాలు తేల్చి, బాధ్యులను గుర్తించనుంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే సమయంలో గురుకులాలు, హాస్టళ్లు, అంగన్వాడీల్లో పాఠశాల ఫుడ్‌ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో హెడ్ మాస్టర్, ఇద్దరు పాఠశాల సిబ్బంది సభ్యులుగా ఉంటారు. ఫుడ్ సేఫ్టీ కమిటీ రుచి చూసిన తర్వాతే విద్యార్థులకు భోజనం వడ్డించాలని సర్కార్ ఆదేశించింది. వంట చేసే ముందు కిచెన్ పరిశీలించి పరిశుభ్రత నిర్ధారించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.ఇటీవల నారాయణపేట జిల్లా మాగనూరు పాఠశాలలో వారం రోజుల వ్యవధిలో విద్యార్థులు 3సార్లు ఫుజ్ పాయిజన్కు గురయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం రోజుల వ్యవధిలో మూడుసార్లు భోజనం వికటించి విద్యార్థులు ఆస్పత్రి పాలవడమేమిటని, ఇలా జరుగుతుంటే సంబంధిత అధికారులు నిద్రపోతున్నారా? అని హైకోర్టు ప్రశ్నించింది. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనడానికి ఇది నిదర్శనమని, ఈ విషయంలో ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకోవడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది.

Latest