జార్ఖండ్ లో సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. మన ఐక్యతే మన అతిపెద్ద ఆయుధమని తన ప్రమాణస్వీకారం సందర్భంగా
49 ఏళ్ల హేమంత్ సోరెన్ ప్రకటించారు. హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగోసారి. జార్ఖండ్‌లో వరుసగా రెండు సార్లు ఏ పార్టీ కూడా విజయం సాధించలేదు. కాని 24 ఏళ్ల ఆ రికార్డును బద్దలుకొట్టి హేమంత్ సోరెన్ వరుసగా ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. మొట్టమొదట రాజ్యసభ సభ్యుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 2009లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక 2010 నుంచి 2013 వరకు బీజేపీ-జేఎంఎం కూటమి ప్రభుత్వంలో అర్జున్ ముండా జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేయగా.. హేమంత్ సోరెన్ ఉపముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత 2013లో కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీల మద్దతుతో జేఎంఎం జార్ఖండ్‌లో అధికారాన్ని ఏర్పాటు చేయగా.. తొలిసారి హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక 2014లో జార్ఖండ్‌లో బీజేపీ అధికారంలోకి రావడంతో హేమంత్ సోరెన్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆ తర్వాత 2019లో జేఎంఎం-కాంగ్రెస్ కూటమి విజయం సాధించడంతో మరోసారి ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ బాధ్యతలు చేపట్టారు. ఆ రాష్ట్ర రాజధాని రాంచీలోని మొరహాబాదీ గ్రౌండ్‌లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీ, బెంగాల్, తమిళనాడు సీఎంలు మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, బీహార్‌లో ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ తదితరులు హాజరయ్యారు. వాస్తవానికి మహారాష్ట్రపై ఇండియా కూటమి ఎన్నో ఆశలు పెట్టుకున్నా అవి విఫలమయ్యాయి. జార్ఖండ్ లో మాత్రం హేమంత్ సోరెన్ విజయాన్ని ఒడిసిపట్టి జారవిడవలేదు. పట్టుజారలేదు. తన బలాన్ని ప్రదర్శించి రెండున్నర దశాబ్దాల సెంటిమెంట్ ను బ్రేక్ చేశారు. సోరెన్ కు జైలుశిక్ష పడగా దీనికిబదులుగా గిరిజన వర్గాల నుంచి ఆయన సానుభూతి పొందారు. ఈ ఎన్నికల విజయానికి గణనీయంగా దోహదపడిన రైతు రుణమాఫీ, విద్యుత్ బిల్లు రాయితీలు , మైయా యోజన పథకంతో సహా ఇంకా అనేకగ్యారంటీలు సోరెన్ ను సక్సెస్ చేశాయి. వీటన్నింటికీ మించి సంప్రదాయ పట్టు, హేమంత్ గుండె ధైర్యం మరోసారి చారిత్రక గెలుపును అందించాయి. ఈ విజయంతో హేమంత్ సోరెన్ జార్ఖండ్ రాజకీయాల్లో తన నాయకత్వాన్ని మరింత సుస్థిరం చేస్తూ గిరిజనుల గుండెల్లో తన ప్రభావాన్ని ప్రదర్శించాడు.








