Mahaa Daily Exclusive

  ఏఐతో 800 ఏళ్ల భారత చరిత్రకు డిజిటల్‌ అట్లాస్‌..!

Share

• కోడింగ్‌ తెలియకపోయినా ‘భారత్‌రాజ్య’ వెబ్‌సైట్‌.
• కృష్ణ శేషాద్రి కృషిని ప్రశంసించిన ప్రధాని మోదీ.

ఢిల్లీ, మహా.

కోడింగ్‌ రంగంతో ఎలాంటి సంబంధం లేకపోయినా కేవలం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సాయంతో భారతదేశ చరిత్రను డిజిటల్‌ రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చిన ముంబైకి చెందిన కృష్ణ శేషాద్రి కృషిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఆదివారం ప్రసారమైన ‘మన్‌ కీ బాత్‌’ 137వ ఎపిసోడ్‌లో ‘భారత్‌రాజ్య’ అనే డిజిటల్‌ హిస్టారికల్‌ అట్లాస్‌ ప్రత్యేకతను దేశ ప్రజలకు వివరించారు.

ఇంజినీరింగ్‌, ఎంబీఏ పూర్తి చేసి మార్కెటింగ్‌ రంగంలో పనిచేస్తున్న కృష్ణ శేషాద్రికి చిన్ననాటి నుంచే చరిత్రపై ఆసక్తి ఉంది. గత 15 ఏళ్లుగా భారతదేశంలోని వివిధ ప్రాంతాలను ఏ కాలంలో ఏ రాజులు, రాజవంశాలు పాలించారో తెలియజేసే ఇంటరాక్టివ్‌ వెబ్‌సైట్‌ రూపొందించాలని ఆయన కలలు కన్నారు. అయితే కోడింగ్‌ పరిజ్ఞానం లేకపోవడంతో ఆ ఆలోచన కార్యరూపం దాల్చలేదు.

ఇటీవల ఆంత్రోపిక్‌ సంస్థకు చెందిన ‘క్లాడ్‌’ ఏఐ మోడల్‌ సాయంతో తన ఆలోచనను వెబ్‌సైట్‌గా రూపొందించారు. ‘నాకు కోడింగ్‌తో ఉన్న సంబంధం నా ఇంటి పిన్‌కోడ్‌ మాత్రమే’ అంటూ కృష్ణ శేషాద్రి తన అనుభవాన్ని సరదాగా వివరించారు. ఏఐ సాయంతో తన 15 ఏళ్ల కల సాకారమైందని తెలిపారు.

‘భారత్‌రాజ్య’ వెబ్‌సైట్‌లో క్రీ.శ. 700 నుంచి ఆధునిక కాలం వరకు దాదాపు 800 ఏళ్ల భారత చరిత్రను ఇంటరాక్టివ్‌ పద్ధతిలో అందించారు. సుమారు 1,000 జిల్లాలకు సంబంధించిన చారిత్రక సమాచారాన్ని టైమ్‌లైన్‌ ద్వారా సులభంగా తెలుసుకునేలా రూపొందించారు. ఏ కాలంలో ఏ సామ్రాజ్యం, ఏ రాజవంశం పాలించిందో వినియోగదారులు సులభంగా పరిశీలించవచ్చు.

విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఉపయోగపడేలా వెబ్‌సైట్‌ను ఉచితంగా అందుబాటులో ఉంచారు. చారిత్రక అంశాలను కథల రూపంలో ఆసక్తికరంగా తెలుసుకునేందుకు ఈ డిజిటల్‌ అట్లాస్‌ ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ అభినందించారు. ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించిన మోదీ స్వయంగా కృష్ణ శేషాద్రితో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

ఏఐ సాంకేతికత సాధారణ ప్రజల సృజనాత్మక ఆలోచనలకు ఎలా ఉపయోగపడుతుందో ‘భారత్‌రాజ్య’ ప్రాజెక్టు చాటి చెబుతోందని ప్రధాని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ప్రత్యేక నైపుణ్యాలు లేని వారు కూడా తమ ఆలోచనలను ఆచరణలోకి తీసుకురాగలుగుతున్నారని ఈ సందర్భంగా వివరించారు.

ప్రధాని నుంచి లభించిన గుర్తింపు తన జీవితంలో అందుకున్న అతిపెద్ద గౌరవమని కృష్ణ శేషాద్రి ఆనందం వ్యక్తం చేశారు. చరిత్రపై తనకున్న ఆసక్తిని ఏఐ సాంకేతికతతో మేళవించి రూపొందించిన ఈ వెబ్‌సైట్‌ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Latest