Mahaa Daily Exclusive

  వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి…

Share

  • వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి
  • ఉత్సవాల ఏర్పాట్లు, నిమజ్జనం పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి
  • వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత
  • పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా పండుగను జరుపుకోవాలి
  • వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు
  • ఉత్సవాల ఏర్పాట్లు, నిర్వహణ పై అధికారులతో సమన్వయ సమావేశం

హనుమకొండ మహా ;

హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో గణపతి నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు, నిర్వహణ పై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో పోలీస్ కమిషనర్ సమన్వయ సమావేశం నిర్వహించారు.
గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా శాంతియుతంగా నిర్వహించుకోవాలని గణేష్ ఉత్సవ కమిటీ, మండపాల నిర్వాహకులకు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత సూచించారు.
బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో గణపతి నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు, నిర్వహణపై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో పోలీస్ కమిషనర్ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో మున్సిపల్, రెవెన్యూ, పోలీస్, విద్యుత్, ఆర్ అండ్ బి, వైద్య ఆరోగ్య, మైనింగ్, మత్స్య, అగ్నిమాపక, తదితర శాఖల అధికారులతో ఆయా శాఖల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన నిర్వహణ ఏర్పాట్లపై చర్చించారు.

ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత మాట్లాడుతూ… గణపతి నవరాత్రులను భక్తులు, నిర్వాహకులు పోలీసు, అధికార యంత్రాంగం సూచనలను పాటిస్తూ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, స్నేహపూర్వక వాతావరణంలో నిర్వహించాలని కోరారు. పర్యావరణహితంగా గణపతి నవరాత్రి ఉత్సవాల నిర్వహించుకోవాలని కోరారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతులను ప్రతిష్టించుకోవాలని సూచించారు. గణపతి మండపాలకు విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలని, తగిన జాగ్రత్తలు మంటపాల నిర్వాహకులు పాటించాలన్నారు,
అగ్ని ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్త లు తీసుకోవాలన్నారు. ప్రమాద నివారణ మార్గాలను అందుబాటులో పెట్టుకోవాలన్నారు.
గణపతి మంటపాల ఏర్పాటుకు నిర్వాహకులు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు.
పోలీస్ అధికారులు ప్రతీ మండపాన్ని తనిఖీ చేస్తారని అన్నారు.
మండపాల వద్ద సౌండ్ పొల్యూషన్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
రాత్రి 10 గంటల తరువాత ఎలాంటి సౌండ్ ఉండడొద్దన్నారు. చదువుకునే పిల్లలకూ, అనారోగ్యంతో భాదపడే వారికి సౌండ్ విషయంలో జాగ్రత్త వహించాలన్నారు.
తప్పని పరిస్థితిలో ఏదైనా సాంస్కృతిక కార్యక్రమం ఉంటే
లోకల్ ఏసీపీ పర్మిషన్ తీసుకోవాలన్నారు.
పెద్ద మండపల వద్ద భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నప్పుడు క్యూ లైన్లు పెట్టి బారికేడింగ్ చేయాలన్నారు.
తొమ్మిది రోజుల పాటు నిర్వాహకులు సమయాలను తప్పకుండా పాటించాలన్నారు.
నవరాత్రుల కు ఉపయోగించే వాహనాల సేఫ్టీ ని ముందుగా చెక్ చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. అదేవిధంగా మండపాల వద్ద భద్రతకోసం సీసీ కెమెరాలను తప్పక ఏర్పాటు చేసుకోవాలని కోరారు.
ప్రస్తుతం ఉన్న ఏల్ నీనో పరిస్థితుల నేపథ్యంలో….నీటి నిల్వలను దృష్టిలో పెట్టుకొని పెద్ద విగ్రహాలు కాకుండా చిన్న విగ్రహాలు అందులోనూ మట్టి విగ్రహాలను ప్రతిష్టించు కోవాలని కోరారు.
భక్తి శ్రద్ధలతో గణేష్ నవరాత్రులను నిర్వహించుకోవాలని సూచించారు. అదేవిధంగా వినాయక విగ్రహాల ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకు అన్ని ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. గణేష్ మండపాల ఏర్పాటు, విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు, భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనపై ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.

ముఖ్యంగా వినాయక విగ్రహాల నిమజ్జన ప్రక్రియను సురక్షితంగా నిర్వహించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న నీటి నిల్వలు, చెరువుల నీటి మట్టం, లోతు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని చర్యలు చేపట్టాలని తెలిపారు.

నిమజ్జన ప్రదేశాల్లో క్రేన్లు, గజ ఈతగాళ్లు, లైటింగ్, బారికేడ్లు, వైద్య సిబ్బంది తదితర అవసరమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
పెద్ద పెద్ద మండపాల వద్ద ఏర్పాట్లను విద్యుత్, ఇతర శాఖల అధికారులు తరచుగా తనిఖీలను నిర్వహించాలని పేర్కొన్నారు.

గణపతి నవరాత్రుల లో ఎమైనా ఇబ్బందులు ఎదురైతే పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712685048 కి సమాచారం అందించాలన్నారు.

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
మాట్లాడుతూ.. వినాయక నిమజ్జన కార్యక్రమాల కోసం ప్రజలు ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి లేకుండా, వారి స్థానిక ప్రాంతాలకు సమీపంలోనే అనువైన నిమజ్జన ప్రాంతాలను గుర్తించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు.
వర్షాభావ పరిస్థితులకు అనుకూలంగా పర్యావరణ పరిరక్షణ అనుకూలంగా పండుగ జరుపు కోవాలన్నారు.
గణేష్ నిమజ్జన ఊరేగింపుల సందర్భంగా ట్రాఫిక్ ప్రణాళికలను ముందుగానే పకడ్బందీగా రూపొందించాలని, చివరి నిమిషంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సంబంధిత శాఖల మధ్య సమన్వయం ఉండాలని సూచించారు.
నిమజ్జనం సమయంలో క్రేన్ డ్రైవర్లు ఎంపిక కీలకమన్నారు.
ముఖ్యంగా నిమజ్జన కార్యక్రమాల్లో చిన్నపిల్లలు, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మట్టి గణపతి విగ్రహాలను ప్రోత్సహించాలి

ఉత్సవ కమిటీలకు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌ పాయ్ విజ్ఞప్తి

వినాయక చవితి ఉత్సవాలను పర్యావరణ హితంగా, ప్రశాంత వాతావరణంలో అన్ని వర్గాల సమన్వయంతో నిర్వహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌ పాయ్ ఉత్సవ కమిటీలకు విజ్ఞప్తి చేశారు.
సాధ్యమైనంత వరకు మట్టి గణపతి విగ్రహాలను ఏర్పాటు చేసేలా ప్రజలను, ఉత్సవ కమిటీలను ప్రోత్సహించాలని సూచించారు.
ప్రతి సంవత్సరం కాలుష్య నియంత్రణ శాఖతో పాటు వివిధ సంస్థలు మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా ప్రజలకు అందిస్తున్నాయని తెలిపారు.
ఈ ఏడాది నీటి లభ్యత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గణేష్ విగ్రహాల పరిమాణాన్ని నిర్ణయించుకోవాలని సూచించారు.
గత ఏడాది ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల ఏర్పాటు పై పోటీ నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ ఏడాది కూడా ఇలాంటి కార్యక్రమాలను మరింత ప్రోత్సహించాలని కోరారు. మట్టి విగ్రహాలను ఏర్పాటు చేయడం వల్ల పర్యావరణానికి మేలు కలగడంతో పాటు నిమజ్జనం సమయంలో నీటి వనరులపై భారం తగ్గుతుందని తెలిపారు.
అదేవిధంగా, రోడ్లపై ఉత్సవ ఏర్పాట్ల కోసం శాశ్వత నిర్మాణాలు లేదా రోడ్లకు నష్టం కలిగించే విధంగా పనులు చేపట్టవద్దని ఉత్సవ కమిటీలను కోరారు.
రోడ్లకు నష్టం కలిగితే వాటి పునరుద్ధరణకు సమయం పడుతుందని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
ఉత్సవాల సందర్భంగా వాహనాల రాకపోకలు, ప్రజల సౌకర్యం, విగ్రహాల ఏర్పాటు, నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించి అధికారులు, ఉత్సవ కమిటీలు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.
ముఖ్యంగా రాత్రి వేళల్లో ఉత్సవ ప్రాంగణాలలో భద్రతా చర్యలు, క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఉత్సవాల విజయవంతంగా నిర్వహణకు పూర్తి సహకారం అందిస్తారని, అదే సందేశాన్ని ఉత్సవ కమిటీలు ప్రజలకు చేరవేసి అందరూ కలిసి సంతోషకరమైన వాతావరణంలో వినాయక చవితి వేడుకలను నిర్వహించాలని కలెక్టర్ కోరారు.
జిడబ్ల్యూఎంసి కమిషనర్ వెంకన్న మాట్లాడుతూ… గణేశ్ నిమజ్జనోత్సవాన్నిపురస్కరించుకుని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. గణేశ్ మండపాలు ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపడతామని, అదేవిధంగా గణేశ్ నిమజ్జన పాయింట్ల వద్ద పారిశుద్ధ్యాన్ని పకడ్బందీగా నిర్వహించి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
నిమజ్జన రూట్లలో అవసరమైన రోడ్డు మరమ్మతులు, ఇతర మౌలిక వసతుల కల్పనను ఇంజనీరింగ్ విభాగం చేపడుతామని పేర్కొన్నారు.
విద్యుత్ విభాగం ఆధ్వర్యంలో నిమజ్జన మార్గాల్లో అవసరమైన చోట్ల లైటింగ్, ఇతర విద్యుత్ సదుపాయాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి, డీసీపీలు దార కవిత, అంకిత్ కుమార్, రాజమహేంద్ర నాయక్, జనగాం అదనపు కలెక్టర్ బెన్ షా లోం, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఏసీపీలు,
ఇతర పోలీస్ అధికారులు,వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లా లకి సంబందించిన ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Latest