Mahaa Daily Exclusive

  వెయ్యి రోజుల పాలన.. అభివృద్ధి, సంక్షేమానికి బాటలు..

Share

  • వెయ్యి రోజుల పాలన.. అభివృద్ధి, సంక్షేమానికి బాటలు
  • రైతు సంక్షేమం.. మహిళా సాధికారత.. యువతకు ఉద్యోగాలు.. పేదలకు సొంతింటి భరోసా
  • ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సారధ్యంలో అభివృద్ధి
  • కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తోటకూరి రాంబాబు
  • కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బానోతు రామ్మూర్తి నాయక్
  • సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు

కారేపల్లి, మహా: తెలంగాణలో ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని, కారేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూరి రాంబాబు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బానోతు రామ్మూర్తి నాయక్, సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం కారేపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ…తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతోందని అన్నారు. ఈ వెయ్యి రోజుల్లో రైతులు, మహిళలు, యువత, పేదలు, ఉద్యోగులు, విద్యార్థుల సంక్షేమానికి పలు కీలక కార్యక్రమాలను చేపట్టిందని తెలిపారు.
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించడం, గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం వంటి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేసిందని పేర్కొన్నారు. మహిళలను కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా కాకుండా ఆర్థికంగా స్వావలంబన సాధించేలా స్వయం సహాయక సంఘాలకు రుణాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా, ఉచిత విద్యుత్, సన్నవడ్లకు బోనస్ వంటి కార్యక్రమాల ద్వారా వ్యవసాయ రంగానికి ప్రభుత్వం చేయూతనిచ్చిందని పంటలకు గిట్టుబాటు ధర, ధాన్యం కొనుగోళ్లను మరింత పటిష్టం చేయడంపై దృష్టి సారించిందనీ చెప్పారు.
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో పాటు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను విస్తరించి యువతకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాల్లో శిక్షణ అందించే కార్యక్రమాలను కొనసాగిస్తోందని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసిందని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు. వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ నేతృత్వంలో వైరా నియోజకవర్గం అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని అన్నారు. ఎమ్మెల్యే సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఐక్యంగా ముందుకు సాగుతోందని చెప్పారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అడ్డగోడ ఐలయ్య, పోలగాని శ్రీనివాసరావు, సురేందర్ మనియార్, మతృనాయక్, ఆదర్ల రాములు, అనీఫ్, యాకూబ్, తాజుద్దీన్, షేర్ తదితరులు పాల్గొన్నారు.

Latest