- శ్రీ భద్రకాళి మాడ వీధుల టెండర్ పై ఉత్కంఠ!
- రూ.19 కోట్లతో రెండో విడత మాడ వీధుల నిర్మాణం
- నేటితో టెండర్ల దాఖలుకు ముగియనున్న గడువు
- శుక్రవారం కాంట్రాక్టు ఖరారయ్యే అవకాశం
- పాత కాంట్రాక్టర్ కే అవకాశమా.. కొత్త సంస్థకా?
వరంగల్, మహా ;
ప్రముఖ ప్రాచీన ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవాలయం రెండో విడత మాడవీధుల నిర్మాణ పనులకు సంబంధించిన సుమారు రూ.19 కోట్ల భారీ టెండర్ అంశం కాస్త గ్రేటర్ వరంగల్లో ఇప్పుడు హాట్ టాపిక్ మారింది. ఈ పనులకు టెండర్లు దాఖలు చేసేందుకు గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకే గడువు ఉండటంతో, ఈ ప్రతిష్టాత్మక కాంట్రాక్టును ఎవరు దక్కించు కుంటారన్నది నగరంలో చర్చనీయాంశంగా మారింది. టెండర్ల దాఖలు ప్రక్రియ ముగిసిన అనంతరం గురువారం సాయంత్రం అధికారులు సాంకేతిక బిడ్లను పరిశీలించనున్నట్లు సమాచారం. అన్ని సాంకేతిక అర్హతలను పరిశీలించిన తర్వాత, ఆర్థిక బిడ్లు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని శుక్రవారం టెండర్ ను ఖరారు చేసే అవకాశం ఉందని కుడా అధికారులు చెబుతున్నారు. అయితే, రూ.19 కోట్ల విలువైన ఈ మాడవీధుల నిర్మాణ కాంట్రాక్టు ఇప్పటికే పనులు చేపట్టిన పాత కాంట్రాక్టర్ కే దక్కుతుందా? లేక కొత్త కాంట్రాక్టర్లు పోటీలోకి వచ్చి టెండర్ను దక్కించుకుంటారా? అన్న అంశం నగరంలో చర్చ నీయాంశమైంది. ముఖ్యంగా భద్రకాళి ఆలయ అభివృద్ధి పనులు కావడంతో ఈ టెండర్పై కాంట్రాక్టర్లతో పాటు రాజకీయ, వ్యాపార వర్గాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఇదిలా ఉండగా, కుడా పరిధిలో జరుగుతున్న కొన్ని అభివృద్ధి పనుల టెండర్లు పదేపదే ఒకరిద్దరు కాంట్రాక్టర్ల కే దక్కుతున్నాయనే విమర్శలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భద్రకాళి మాడవీధుల రూ.19 కోట్ల టెండర్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందా? అన్ని అర్హత కలిగిన కాంట్రాక్టర్లకు సమాన అవకాశం కల్పిస్తారా? లేక మళ్లీ అదే వర్గాలకు పనులు దక్కుతాయా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ప్రజల సొమ్ముతో చేపడుతున్న ఇలాంటి భారీ అభివృద్ధి పనుల్లో పూర్తి పారదర్శకత పాటించాలని, టెండర్ నిబంధనలు, అర్హతలు, సాంకేతిక పరిశీలన, ఆర్థిక బిడ్ల ఎంపిక వంటి అంశాలను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. మొత్తానికి, భద్రకాళి మాడవీధుల నిర్మాణానికి సంబంధించిన రూ.19 కోట్ల టెండర్ ఎవరికి దక్కుతుంది? పాత కాంట్రాక్టర్ మళ్లీ కాంట్రాక్టును చేజిక్కించుకుంటారా? లేక కొత్త సంస్థకు అవకాశం దక్కుతుందా? అన్న ఉత్కంఠకు శుక్రవారం తెరపడే అవకాశం ఉందని తెలుస్తోంది.








