• రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు సెల్ఫీ చాలెంజ్.
• ఆగిపోయిన సాగునీటి పనులు వెంటనే చేపట్టాలని డిమాండ్.
హైదరాబాద్, మహా.
తెలంగాణలో నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టులు, కాలువల పనులను వెంటనే ప్రారంభించాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నర్సాపూర్ నియోజకవర్గం రెడ్డిపల్లి వద్ద ఆగిపోయిన కాళేశ్వరం కాలువ పనులను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. కాలువల్లో నీరు పారాల్సిన చోట తుమ్మ చెట్లు పెరిగాయని పేర్కొంటూ అక్కడి నుంచే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సెల్ఫీ చాలెంజ్ విసిరారు.
మల్లన్నసాగర్ నుంచి నర్సాపూర్, ఆందోల్, సంగారెడ్డి నియోజకవర్గాలకు సాగునీరు అందించేందుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్యాకేజీ 18, 19 కింద ప్రణాళిక రూపొందించిందని హరీశ్‌రావు తెలిపారు. మల్లన్నసాగర్ నుంచి నర్సాపూర్ వైపు వచ్చే సొరంగం పనుల్లో 85 శాతం పూర్తయ్యాయని, సుమారు 300 మీటర్ల పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పారు. ఆ పనులు పూర్తయితే కాలువ ద్వారా నీటిని హల్దీ వాగులోకి తీసుకెళ్లి నిజాంసాగర్ వరకు గోదావరి జలాలను తరలించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లన్నసాగర్, కాళేశ్వరం కాలువల పనులు నిలిచిపోయాయని హరీశ్‌రావు ఆరోపించారు. పెండింగ్ పనులను పూర్తి చేయడానికి నిధులు విడుదల చేయడం లేదని విమర్శించారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయకసాగర్ పరిధిలోని పిల్ల కాలువల పనులకు రూ.50 కోట్లు కేటాయిస్తే సుమారు 50 వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలోని బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టుల పనులను కూడా ప్రభుత్వం కొనసాగించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. నారాయణఖేడ్, జహీరాబాద్, ఆందోల్, సంగారెడ్డి, పటాన్‌చెరు నియోజకవర్గాల్లో సాగునీటి అవసరాలను తీర్చే ఈ ప్రాజెక్టుల పనులు నిలిచిపోయాయని ఆరోపించారు. ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంపు పనులను కూడా వెంటనే పూర్తి చేయాలని కోరారు.
దుబ్బాక నియోజకవర్గంలో 80 శాతం పూర్తయినట్లు పేర్కొన్న ఎత్తిపోతల పథకం పనులను కూడా ప్రభుత్వం తిరిగి ప్రారంభించాలని హరీశ్‌రావు కోరారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లను నీటితో నింపడంతో పాటు వాటి పరిధిలోని పెండింగ్ కాలువల పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు భూసేకరణ కోసం అవసరమైన నిధులను విడుదల చేయాలని హరీశ్‌రావు కోరారు. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల పనులను తక్షణమే ప్రారంభించాలని, ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంపు పనులను పూర్తి చేయాలని, మల్లన్నసాగర్ నుంచి నర్సాపూర్, ఆందోల్ ప్రాంతాలకు నీటిని తీసుకెళ్లే కాళేశ్వరం కాలువ పనులను పూర్తిచేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఆగిపోయిన కాలువ పనులకు, వాటిలో పెరిగిన తుమ్మ చెట్లకు సాక్ష్యంగా రెడ్డిపల్లి నుంచి సెల్ఫీ తీసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పంపుతున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిలిచిపోయిన సొరంగం, కాలువలు, సాగునీటి ప్రాజెక్టుల పనులను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.







