- క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగ
- మెగా ఈవెంట్స్ అన్నీ మన గడ్డమీదే !
- ఏడాది ఆరంభం నుంచే క్రికెట్ కిక్కు
- ఒకటి ముగిసేలోపే మరోటి
- అభిమానులకు నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్
హైదరాబాద్, మహా : భారత క్రికెట్ అభిమానులకు 2027 ఏడాది ఓ రేంజ్‌లో ఉండబోతోంది. జనవరి నుంచి మే వరకు దాదాపు ఐదు నెలల పాటు దేశంలో వరుసగా హై-ప్రొఫైల్ క్రికెట్ ఈవెంట్లు జరగనున్నాయి. మహిళల క్రికెట్‌లో డబ్ల్యూపీఎల్‌తో మొదలయ్యే హంగామా ఆ వెంటనే ఆస్ట్రేలియాతో ప్రతిష్ఠాత్మక బోర్డర్-గావస్కర్ ట్రోఫీ, ఫిబ్రవరిలో తొలిసారిగా జరగనున్న మహిళల చాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆథిధ్యం ఇవ్వడం.., మార్చి నుంచి మే వరకు ఐపీఎల్‌తో మరింత పీక్స్‌కు చేరనుంది. 2027 ఆరంభం నుంచి క్రికెట్ క్యాలెండర్‌లో ఒక్క నెల కూడా బోర్ కొట్టించేలా కనిపించడం లేదు.
జనవరి.. డబ్ల్యూపీఎల్ హంగామా
మహిళల క్రికెట్‌కు ఆదరణ పెరుగుతుండటంతో డబ్ల్యూపీఎల్‌కు కూడా భారీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. దీంతో 2027 క్రికెట్ సీజన్‌కు మహిళల ప్రీమియర్ లీగ్ హైప్‌తోనే తెరలేచే అవకాశం ఉంది. భారత మహిళా క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ లీగ్.. మరోసారి స్టార్ ప్లేయర్ల ఆటతో అభిమానులను అలరించనుంది. ఫ్రాంచైజీల మధ్య హోరాహోరీ పోటీ, భారత మహిళా క్రికెటర్ల సత్తా, అంతర్జాతీయ స్టార్ ప్లేయర్ల మెరుపులతో జనవరి నుంచే దేశంలో క్రికెట్ సందడి మొదలుకానుంది.
అదే సమయంలో భారత పురుషుల జట్టు ఆస్ట్రేలియాతో ప్రతిష్ఠాత్మక బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో తలపడనుంది. ఐదు టెస్టుల ఈ సిరీస్ జనవరి 21 నుంచి మార్చి 3 వరకు భారత్‌లో జరగనుంది. నాగ్‌పూర్, చెన్నై, గువాహటి, రాంచీ, అహ్మదాబాద్ వేదికలుగా మ్యాచ్‌లు జరగడంతో.. డబ్ల్యూపీఎల్ సందడితో పాటు టెస్టు క్రికెట్ ఉత్కంఠ కూడా జనవరి నుంచే అభిమానులను అలరించనుంది.
అయితే ఈ సిరీస్ కేవలం భారత్-ఆస్ట్రేలియా పోరు మాత్రమే కాదు.. 2027 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో భారత్‌కు అత్యంత కీలకంగా మారనుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ ఐదో స్థానంలో ఉండటంతో.. ఫైనల్ బెర్త్ కోసం మిగిలిన మ్యాచ్‌ల్లో ప్రతి విజయం కీలకమే. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల్లో సాధించే ఫలితాలు భారత్ అవకాశాలను గణనీయంగా ప్రభావితం చేయనున్నాయి. దీంతో బోర్డర్-గావస్కర్ ట్రోఫీకి ఈసారి మరింత ప్రాధాన్యం ఏర్పడింది.
భారత్ ఫైనల్ చేరాలంటే మిగిలిన ఏడు టెస్టుల్లో సాధ్యమైనంత ఎక్కువ విజయాలు సాధించాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియాపై 4–1 లేదా 3–1తో సిరీస్ గెలిస్తే అవకాశాలు గణనీయంగా మెరుగుపడతాయి. 3–2తో సిరీస్ గెలిచినా.. ఇతర జట్ల ఫలితాలు కూడా భారత్‌కు అనుకూలంగా రావాల్సి ఉంటుంది. అంటే ఆస్ట్రేలియాతో జరిగే ప్రతి టెస్టు ఫలితం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో భారత్ పరిస్థితిని ప్రభావితం చేయనుంది. అందుకే 2027 జనవరి నుంచి మార్చి వరకు జరిగే ఈ సిరీస్‌పై అభిమానులు, క్రికెట్ వర్గాల్లో భారీ ఆసక్తి నెలకొననుంది.
ఫిబ్రవరి.. మహిళల క్రికెట్‌కు చారిత్రక నెల
తొలిసారిగా నిర్వహించనున్న ఐసీసీ మహిళల చాంపియన్స్ ట్రోఫీ ఫస్ట్ ఎడిషన్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నీ ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు జరగనుండగా మహిళల క్రికెట్‌లో కొత్తగా ఆవిష్కరిస్తున్న ఈ మెగా టోర్నీకి తొలి వేదికగా నిలిచే అవకాశం భారత్‌కు దక్కింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంకతో కూడిన ఆరు జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా, వడోదరలోని వడోదర ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్నాయి.
తొలి ఎడిషన్ కావడంతో ఈ టోర్నీకి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. అంతేకాదు.. మహిళల చాంపియన్స్ ట్రోఫీని టీ 20 అంతర్జాతీయ ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. ఆరు జట్లు రౌండ్ రాబిన్ లీగ్‌లో తలపడిన తర్వాత పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు ఫిబ్రవరి 28న జరిగే ఫైనల్‌లో టైటిల్ కోసం పోటీ పడతాయి. మొత్తం 16 మ్యాచ్‌లతో జరిగే ఈ మెగా టోర్నీలో ప్రపంచంలోని అగ్రశ్రేణి మహిళా క్రికెటర్లు ఒకే వేదికపై తలపడనున్నారు. వాస్తవానికి ఈ తొలి ఎడిషన్‌మకు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా, ఆతిథ్య హక్కులు భారతదేశానికి బదిలీ అయ్యాయి. దీంతో, ఈ కొత్త మెగా టోర్నమెంట్‌కు మొదటి ఎడిషన్ నుంచే ఆతిథ్యం ఇచ్చే గౌరవం భారతదేశానికి దక్కింది. ప్రపంచంలోని టాప్ మహిళా జట్లన్నీ భారత గడ్డపై పోటీ పడటం ఈ టోర్నీకి మరింత క్రేజ్ తీసుకురానుంది.
మార్చి.. ఐపీఎల్ కోసం ఎదురుచూపులు
మహిళల చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన వెంటనే క్రికెట్ అభిమానుల ఫోకస్ ఐపీఎల్ వైపు మళ్లనుంది. 2027 ఐపీఎల్ మార్చి 10 నుంచి మే 15 వరకు జరగనుంది. దాదాపు రెండు నెలల పాటు సాగే ఈ మెగా లీగ్‌తో దేశంలో క్రికెట్ హంగామా పీక్స్‌కు చేరనుంది. స్టార్ ఆటగాళ్లు, యువ ప్రతిభ, హై-వోల్టేజ్ మ్యాచ్‌లతో ప్రతిరోజూ క్రికెట్ సందడే కనిపించనుంది.
జనవరిలో డబ్ల్యూపీఎల్ సందడి.. అదే సమయంలో బోర్డర్-గావస్కర్ ట్రోఫీతో టెస్టు క్రికెట్ హీట్.. ఫిబ్రవరిలో తొలిసారి నిర్వహిస్తున్న మహిళల చాంపియన్స్ ట్రోఫీ తొలి ఎడిషన్‌కు భారత్ ఆతిథ్యం.. ఆ వెంటనే మార్చి నుంచి ఐపీఎల్ ధమాకా.. ఇలా 2027 తొలి ఐదు నెలలు భారత క్రికెట్ అభిమానులకు ఫుల్ క్రికెట్ ఫీస్ట్‌గా మారనున్నాయి.
ఒక టోర్నీ ముగిసేలోపే మరో హై-ప్రొఫైల్ ఈవెంట్ మొదలవుతూ.. ఏడాది ఆరంభం నుంచే క్రికెట్ సందడి కొనసాగనుంది. ఇది కేవలం వరుసగా టోర్నీలు జరగనున్న క్యాలెండర్ మాత్రమే కాదు.. ప్రపంచ క్రికెట్‌లో భారత్ ఎంత కీలకమైన మార్కెట్‌గా, ఆతిథ్య కేంద్రంగా ఎదిగిందో చెప్పే పరిణామం కూడా… ఇలా ఒక మెగా ఈవెంట్ ముగిసేలోపే మరో హై-ప్రొఫైల్ టోర్నీ మొదలవడం 2027 ఏడాదిని మరింత ప్రత్యేకంగా మార్చనుంది.








