- ప్రభుత్వ సంస్థగానే కొనసాగుతుంది.
- ఏడాదికి 50 రాకెట్ ప్రయోగాలే లక్ష్యం.
- స్పేస్ ఎకానమీని భారీగా పెంచాలి.
- 450 కంపెనీలు ఇస్రోతో కలిసి పనిచేస్తున్నాయి.
- ఉద్యోగుల ఆందోళనపై స్పష్టత ఇస్తాం.
- వీ. నారాయణన్
బెంగళూరు, మహా.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని ఇస్రో చైర్మన్ వీ. నారాయణన్ స్పష్టం చేశారు. ఇస్రో ఎప్పటికీ ప్రభుత్వ సంస్థగానే కొనసాగుతుందని ఆయన తేల్చిచెప్పారు. దేశ అంతరిక్ష వ్యవస్థను మరింత విస్తరించేందుకు ప్రైవేటు కంపెనీలు, స్టార్టప్‌లతో కలిసి పనిచేస్తున్నామని వెల్లడించారు. ఇస్రోలోని కొన్ని తయారీ, ఆపరేషనల్ కార్యకలాపాలను ప్రైవేటు రంగంతో భాగస్వామ్యం చేయడం అంటే సంస్థను ప్రైవేటీకరించడం కాదని ఆయన స్పష్టం చేశారు.
9వ బెంగళూరు స్పేస్ ఎక్స్పోను ప్రారంభించిన అనంతరం నారాయణన్ మీడియాతో మాట్లాడారు. ఇస్రోకు 65 ఏళ్లు పూర్తయ్యాయని, ప్రస్తుతం సాధారణ ప్రజలకు వివిధ సేవలు అందించేందుకు అంతరిక్షంలో 56 భారతీయ ఉపగ్రహ ఆస్తులు ఉన్నాయని తెలిపారు. అయితే దేశ అవసరాలకు అనుగుణంగా ఈ సంఖ్య మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు.
ఇస్రోను ప్రైవేటీకరిస్తున్నారంటూ సంస్థకు చెందిన తొమ్మిది ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేసి, ఆగస్టు 4న లేఖ రాసిన నేపథ్యంలో చైర్మన్ ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు. ఉద్యోగుల్లో ఆందోళన నెలకొనడం వాస్తవమేనని, దానిపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత తమపై ఉందని నారాయణన్ పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఇస్రోతో 450 కంపెనీల భాగస్వామ్యం
దేశ అంతరిక్ష రంగం అభివృద్ధిలో ప్రైవేటు పరిశ్రమల భాగస్వామ్యం కీలకమని నారాయణన్ తెలిపారు. ప్రస్తుతం సుమారు 450 కంపెనీలు ఇస్రో కోసం పనిచేస్తున్నాయని వెల్లడించారు. అంతరిక్ష రంగంలో దాదాపు ఆరేళ్ల క్రితం పెద్ద ఎత్తున సంస్కరణలు ప్రారంభమయ్యాయని, వాటి ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలోని సామర్థ్యాలను ప్రైవేటు రంగం, స్టార్టప్‌ల సామర్థ్యాలతో అనుసంధానించి భారత అంతరిక్ష వ్యవస్థను మరింత బలోపేతం చేయడమేనని వివరించారు.
పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ వంటి ప్రయోగ వాహనాల తయారీ, ప్రయోగ కార్యక్రమాల్లో భారతీయ పరిశ్రమలకు పెద్దఎత్తున అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. ప్రయోగాల సందర్భంగా వెచ్చించే బడ్జెట్లో సుమారు 80 శాతం భారతీయ పరిశ్రమల్లోనే పెట్టుబడిగా వెళ్తోందని నారాయణన్ తెలిపారు. దీని ద్వారా దేశీయ అంతరిక్ష పరిశ్రమకు మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు.
ఏడాదికి 50 ప్రయోగాల దిశగా ఇస్రో
భారత అంతరిక్ష లక్ష్యాలను చేరుకోవాలంటే రాకెట్ ప్రయోగాల సంఖ్యను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని ఇస్రో చైర్మన్ అన్నారు. ఏడాదికి సుమారు 50 ప్రయోగాలు చేపట్టే స్థాయికి భారత్ చేరుకోవాల్సి ఉందని లక్ష్యాన్ని వెల్లడించారు. అంతరిక్ష రంగంలో దేశం మరింత వేగంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
తాను 43 ఏళ్ల క్రితం ఇస్రోలో చేరిన సమయంలో మూడేళ్లకు ఒకసారి ప్రయోగం జరిగేదని నారాయణన్ గుర్తుచేశారు. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం ప్రయోగాల వేగం గణనీయంగా పెరిగిందన్నారు. భవిష్యత్తులో దేశ అవసరాలు మరింత పెరగనున్న నేపథ్యంలో ప్రయోగాల సంఖ్యను ఏడాదికి 50 వరకు తీసుకెళ్లే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు.
ఇస్రో ప్రైవేటీకరణపై వస్తున్న ఆందోళనలను ప్రస్తావిస్తూ.. ఇస్రోలో ప్రభుత్వ పెట్టుబడి కొనసాగుతోందని, తామంతా ప్రభుత్వ సంస్థలోనే పనిచేస్తున్నామని నారాయణన్ స్పష్టం చేశారు. ఇస్రోను ప్రభుత్వ సంస్థగానే కొనసాగిస్తూ, దేశంలో సమగ్ర అంతరిక్ష వ్యవస్థను అభివృద్ధి చేయడమే లక్ష్యమని తెలిపారు.
స్పేస్ ఎకానమీ మరింత విస్తరించాలి
భారత్ అంతరిక్ష రంగంలో మరింత పెద్ద ఆర్థిక వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఉందని నారాయణన్ పేర్కొన్నారు. ఇస్రో ఒక్కటే అంతరిక్ష రంగాన్ని ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కాదని, ప్రైవేటు కంపెనీలు, స్టార్టప్‌లు, పరిశ్రమలు కలిసి పనిచేసినప్పుడే దేశ అంతరిక్ష సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోగలమని ఆయన అభిప్రాయపడ్డారు.
దేశ సాధారణ ప్రజలకు మరిన్ని అంతరిక్ష ఆధారిత సేవలు అందించాలంటే ఉపగ్రహాల సంఖ్య, ప్రయోగాల సంఖ్య, పరిశ్రమల సామర్థ్యం అన్నీ పెరగాల్సి ఉంటుందని చెప్పారు. అందుకే ప్రైవేటు రంగాన్ని భాగస్వామిగా చేసుకుని అంతరిక్ష రంగాన్ని విస్తరిస్తున్నామని వివరించారు.








