Mahaa Daily Exclusive

  తుమ్మిడిహెట్టి బ్యారేజీ సాధనే లక్ష్యం.

Share

  •  పాలమూరు ప్రాజెక్టుకు ఎలాంటి కోత పడొద్దు.
  •  డిండి, అచ్చంపేట ఎత్తిపోతలకు అదనపు నీటి కేటాయింపులు.
  •  మహారాష్ట్రతో చర్చలకు సర్వసన్నద్ధం.
  •  సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి!

హైదరాబాద్, మహా.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతాంగం చిరకాల వాంఛ అయిన తుమ్మిడిహెట్టి బ్యారేజీ సాధనే ఏకైక లక్ష్యంగా ముందుకువెళ్తున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వంతో త్వరగా జరగబోయే కీలక చర్చలకు సర్వసన్నద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రాజెక్టుకూ అన్యాయం జరగకుండా, ముఖ్యంగా ప్రతిష్టాత్మక పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఎలాంటి నీటి కోత పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదే సమయంలో డిండి, అచ్చంపేట ఎత్తిపోతల ప్రాజెక్టులకు అవసరమైన అదనపు నీటిని కేటాయించేలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రంలో సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, కీలక ప్రాజెక్టుల పురోగతిపై శుక్రవారం ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి సచివాలయంలో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి , మంత్రులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు , జూపల్లి కృష్ణారావు , రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి తో పాటు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ భేటీలో ప్రధానంగా తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌తో పాటు డిండి, అచ్చంపేట ఎత్తిపోతల ప్రాజెక్టులపై నెలకొన్న పీఠముడి అంశాలపై లోతుగా చర్చించారు.

తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో త్వరలో జరిగే చర్చలకు సర్వసన్నద్ధంగా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ నెల 23 తర్వాత చర్చలకు ఆహ్వానిస్తానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇటీవల సూచనప్రాయంగా తెలియజేసినట్లు సీఎం వెల్లడించారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రతో చర్చల సందర్భంగా తెలంగాణ నీటి అవసరాలను స్పష్టంగా తెలియజేసి, మన వాదనను సమర్థంగా వినిపించాలని మంత్రులకు సూచించారు. ఇటీవల ఢిల్లీలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలో జరిగిన సమావేశాల వివరాలు, అక్కడ చర్చించిన అంశాలు, సీడబ్ల్యూసీ కోరిన నివేదికలన్నీ వెంటనే సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

సమీక్షలో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని వివిధ ఎత్తుల్లో నిర్మిస్తే జరిగే ప్రయోజనాలు, తలెత్తే ముంపు ప్రభావంపై ఇంజనీరింగ్ అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. బ్యారేజీని 152 మీటర్ల ఎత్తున నిర్మిస్తే ఎల్లంపల్లి వరకు భారీగా నీటిని తరలించే అవకాశం ఉంటుందని, అయితే దీనివల్ల మహారాష్ట్ర పరిధిలో దాదాపు 2,300 ఎకరాల భూములు ముంపునకు గురవుతాయని తెలిపారు. అదే 150 మీటర్ల ఎత్తున నిర్మిస్తే వెయ్యి ఎకరాల లోపే ముంపు ప్రభావం ఉంటుందని వివరించారు. అయితే, మహారాష్ట్ర పరిధిలో ఎక్కడ కూడా ప్రధాన గ్రామాలు ముంపునకు గురికావని స్పష్టం చేశారు. గతంలో 148 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర అంగీకరించినప్పటికీ, అంత తక్కువ ఎత్తున బ్యారేజీ నిర్మిస్తే ఆశించినంత నీటిని తెచ్చుకునే వీలుండదని సీఎం అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలో ముంపు ప్రభావాన్ని కనీస స్థాయిలో అంచనా వేస్తూనే, తెలంగాణకు గరిష్ఠంగా నీటి లభ్యత ఉండేలా బ్యారేజీని నిర్మించాలని ఆదేశించారు.

అటవీ, గిరిజన ప్రాంతం కావడంతో పాటు అత్యంత వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ప్రధాన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ‘జల్, జంగిల్, జమీన్’ నినాదంతో ఏళ్ల తరబడి పోరాడిన అటవీ ప్రాంతవాసులందరికీ ఈ ప్రాజెక్టు ద్వారా మేలు జరగాలని, అదే లక్ష్యాన్ని సాధించే సంకల్పంతో మహారాష్ట్ర ప్రభుత్వంతో సానుకూల చర్చలు జరగాలన్నదే తన ఆకాంక్ష అని చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు అవసరమైన సాంకేతిక నివేదికలు, నీటి లభ్యత, ముంపు విస్తీర్ణం , ఇతర అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. బ్యారేజీ ఎత్తుపై స్పష్టత వచ్చిన తర్వాత, తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు నీటిని తెచ్చే ప్రాజెక్టు రూట్ డిజైన్లు, భూసేకరణ పనులపై దృష్టి సారించాలని ఇరిగేషన్ ఇంజనీర్లను ఆదేశించారు.

డిండి, అచ్చంపేట ఎత్తిపోతల పనులకు అదనపు నీటి కేటాయింపులు మరోవైపు డిండి ప్రాజెక్టు, అచ్చంపేట ఎత్తిపోతల పథకాలకు అవసరమైన నీటి తరలింపుపై కూడా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డిండి ప్రాజెక్టుకు ఏదుల రిజర్వాయర్ నుంచి 0.5 టీఎంసీల నీరు, అచ్చంపేట ఎత్తిపోతల పథకానికి 0.1 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ రెండు ప్రాజెక్టులకు అదనంగా అవసరమయ్యే మొత్తం 0.6 టీఎంసీల నీటిని శ్రీశైలం నుంచి సమకూర్చుకోవాలని స్పష్టం చేశారు. శ్రీశైలం, నార్లాపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్ వరకు ఈ అదనపు నీటిని లిఫ్ట్ చేసుకునేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

నార్లాపూర్ నుంచి లేదా ఏదుల నుంచి డిండికి నీటిని ఎక్కడి నుంచి తీసుకోవాలనే అంశంపై మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల ప్రజాప్రతినిధుల అభ్యంతరాలు, విజ్ఞప్తులపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా నార్లాపూర్ నుంచి నీటిని తరలిస్తే ఎంత ఖర్చవుతుంది, ఏదుల నుంచి నీటిని తీసుకుంటే ఎంత అంచనా వ్యయం అవుతుందనే వివరాలను అధికారులు వివరించారు. వాటిలోని అనుకూలతలు, ప్రతికూలతలను విశ్లేషించారు. ఎక్కడెక్కడ పంపులు, పంప్‌హౌస్‌లు ఏర్పాటు చేయాలి, ప్రస్తుతం ఉన్న కాల్వలు మరియు సొరంగాల సామర్థ్యం సరిపోతుందా లేదా అనేదానిపై నీటి పారుదల విభాగం వెంటనే అధ్యಯనం చేసి తగిన డిజైన్లు తయారు చేసుకోవాలని ఆదేశించారు.

పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నీటి అవసరాలకు ఎలాంటి కోత పడకుండా, పాలమూరు నీటి కేటాయింపులకు ఏమాత్రం ఆటంకం లేకుండా ఏదుల నుంచి డిండి, అచ్చంపేట ప్రాజెక్టులకు నీటిని అందించేలా పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మధ్యేమార్గంగా పాలమూరు ప్రాజెక్టు నీటికి ఢోకా లేకుండా డిండి, అచ్చంపేట ఎత్తిపోతలకు అదనపు నీటిని తెచ్చుకునే పనులు చేపట్టాలని సీఎం చేసిన సూచనకు సమావేశంలోని మంత్రులందరూ సంపూర్ణ మద్దతు తెలిపారు. ప్రాజెక్టుల వేగవంతమైన అమలు ద్వారా రైతాంగానికి సాగునీరు అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.