- నవంబర్ నుంచి యూనిట్‌కు 30 పైసలు.. డిసెంబర్ నుంచి 50 పైసలు వసూలు.
- గృహ, వాణిజ్య వినియోగదారులపై రూ.5,420 కోట్ల భారం.
- వ్యవసాయ రంగానికి మినహాయింపు.. అనుమతిచ్చిన టీజీఈఆర్సీ.
హైదరాబాద్, మహా.
తెలంగాణలోని విద్యుత్ వినియోగదారులకు పంపిణీ సంస్థలు (డిస్కంలు) భారీ షాకిచ్చాయి. గత ఆర్థిక సంవత్సరాల్లో విద్యుత్ కొనుగోలు వ్యయం, ఆదాయ వ్యత్యాసాల కారణంగా ఏర్పడిన లోటును పూడ్చుకునేందుకు డిస్కంలు ప్రతిపాదించిన ‘ట్రూ-అప్’ ఛార్జీల వసూలుకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ) అధికారికంగా పచ్చజెండా ఊపింది. దీంతో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్), ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎన్పీడీసీఎల్) పరిధిలోని గృహ, వాణిజ్య వినియోగదారులపై వేల కోట్ల రూపాయల ఆర్థిక భారం పడనుంది.
తాజా నిర్ణయం ప్రకారం.. వచ్చే నవంబర్ నెల నుంచి వినియోగదారుల బిల్లుల్లో ట్రూ-అప్ ఛార్జీల వడ్డన మొదలుకానుంది. నవంబర్ నెలలో వాడే విద్యుత్‌కు సంబంధించి యూనిట్‌పై 30 పైసల చొప్పున అదనంగా వసూలు చేయనుండగా, డిసెంబర్ నుంచి యూనిట్‌కు 50 పైసల చొప్పున వసూలు చేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా మొత్తం రూ.7,635.22 కోట్ల మేర ఆర్థిక లోటును సర్దుబాటు చేయనున్నారు. అయితే, ఉచిత విద్యుత్ విధానం అమలులో ఉన్న వ్యవసాయ రంగానికి మాత్రం ఈ ట్రూ-అప్ ఛార్జీల నుంచి ఈఆర్సీ పూర్తి మినహాయింపునిచ్చింది. వ్యవసాయ విభాగానికి సంబంధించిన రూ.2,214.99 కోట్లను ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ సబ్సిడీలో ఎస్పీడీసీఎల్ వాటా రూ.1,442.49 కోట్లు కాగా, ఎన్పీడీసీఎల్ వాటా రూ.772.50 కోట్లుగా నిర్ధారించారు.
వ్యవసాయ రంగానికి మినహాయింపు పోగా, మిగిలిన రూ.5,420.23 కోట్ల భారాన్ని గృహ, వాణిజ్య, ఇతర కేటగిరీల వినియోగదారుల నుంచి వసూలు చేయనున్నారు. ఇందులో ఎస్పీడీసీఎల్ పరిధిలోని వినియోగదారులపై రూ.4,222.93 కోట్లు, ఎన్పీడీసీఎల్ పరిధిలోని వారిపై రూ.1,197.30 కోట్ల భారం పడనుంది. ఈ వసూళ్ల ప్రక్రియను క్రమపద్ధతిలో అమలు చేయాలని ఈఆర్సీ సూచించింది. దీనిలో భాగంగా ఎస్పీడీసీఎల్ వినియోగదారులు 29 నెలల పాటు, ఎన్పీడీసీఎల్ వినియోగదారులు 26 నెలల పాటు ఈ అదనపు ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. పారదర్శకత కోసం వినియోగదారుల బిల్లుల్లో ఈ ట్రూ-అప్ మొత్తాన్ని ఇతర ఛార్జీలతో కలపకుండా, ఏ ఆర్థిక సంవత్సరానికి ఆ సంవత్సరం వివరాలను విడిగా, స్పష్టంగా ముద్రించాలని డిస్కంలను ఈఆర్సీ కచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న సామాన్యులకు ఈ విద్యుత్ బిల్లుల మోత మరింత ఆందోళన కలిగిస్తోంది.







