తాడేపల్లి, మహా : ఓ యువతికి బస్సులో ఆర్టీసీ కండక్టర్ పరిచయం అయ్యాడు.. ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత కండక్టర్ తనను మోసం చేశాడని యువతి ఆరోపించింది. రూ.20 లక్షలు డబ్బులు, బంగారం తీసుకున్నాడని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలంటూ ఏపీ మంత్రిని ఆశ్రయించగా.. ఆయన కండక్టర్‌పై చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలానికి చెందిన తాను ప్రతిరోజూ తిరుపతికి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అదే బస్సులో కండక్టర్‌తో తనకు పరిచయం ఏర్పడిందని.. అప్పటి నుంచి తనను ప్రేమిస్తున్నానని నమ్మించినట్లు తెలిపింది.
ప్రేమ పేరుతో తనకు మాయ మాటలు చెప్పి.. తన దగ్గర నుంచి దాదాపు రూ.20 లక్షల వరకు డబ్బులు తీసుకున్నాడని యువతి ఆరోపించింది. కండక్టర్‌కు ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపించానని.. తనతో బంగారం కూడా కొనిపించుకున్నాడని ఆరోపించింది. తన దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు, బంగారం తిరిగి ఇవ్వకుండా కండక్టర్ ఇబ్బంది పెట్టాడని ఆవేదన వ్యక్తం చేసింది. రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో కలిసి తనకు న్యాయం చేయాలని కోరానన్నారు. తన దగ్గర ఉన్న ఫోన్‌పే లావాదేవీల వివరాలు, ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, బంగారం కొనుగోలుకు సంబంధించిన బిల్లులు, ఇతర ఆధారాలను కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పుకొచ్చారు.
బాధితురాలు ఫిర్యాదుపై స్పందించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెంటనే తిరుపతి ఆర్టీసీ రీజినల్ మేనేజర్‌కు ఫోన్ చేశారు. బాధితురాలి ఆరోపణలపై సమగ్రంగా విచారణ జరిపి.. సంబంధిత కండక్టర్‌పై కఠినమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్రజలకు సేవ చేయాల్సిన ఆర్టీసీ సిబ్బంది తమ విధుల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని.. ప్రయాణికులతో ముఖ్యంగా మహిళలతో మర్యాదగా, బాధ్యతతో వ్యవహరించాలన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. యువతి ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ చేసి.. ఒకవేళ కండక్టర్ తప్పు ఉంటే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆర్టీసీ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని, సిబ్బంది ప్రవర్తనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. బాధితురాలికి చట్టపరంగా న్యాయం జరిగేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళల భద్రత, గౌరవానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని.. బాధిత యువతికి అండగా ఉంటామన్నారు.







