Mahaa Daily Exclusive

  రిజిస్ట్రేషన్ల ఆదాయంలో 21.86 శాతం వృద్ధి.

Share

• రేవంత్‌ రెడ్డి పాలనకు ఇదే నిదర్శనం: పొంగులేటి

హైదరాబాద్‌, మహా:

తెలంగాణలో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వ ఆదాయం పెరగడమే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పాలనపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చిన ఆదాయం గత ఏడాదితో పోలిస్తే 21.86 శాతం పెరిగిందని తెలిపారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయంలో నమోదైన ఈ వృద్ధి ప్రభుత్వ పనితీరును ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. ఈ వివరాలను ఆయన సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో వెల్లడించారు.

భూ అక్రమాలపై చర్యలు

గత పదేళ్ల బీఆర్ఎస్‌ పాలనలో చోటుచేసుకున్న భూ అక్రమాలను తమ ప్రభుత్వం వెలికితీస్తోందని పొంగులేటి తెలిపారు. భూముల విషయంలో బీఆర్ఎస్‌ చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు విశ్వసించడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై నమ్మకంతో ఉన్నారని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం భూముల అంశాన్ని వివాదాస్పదం చేయడం సరికాదని అన్నారు. గతంలో జరిగిన భూ లావాదేవీలు, అక్రమాలకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తూ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

పెండింగ్‌ భూ సమస్యల పరిష్కారంపై దృష్టి

రాష్ట్రంలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు. భూ వివాదాలను పరిష్కరించి, ప్రజలకు స్పష్టమైన హక్కులతో కూడిన భూములు అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. భూముల రికార్డుల నిర్వహణ, రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడించారు. రిజిస్ట్రేషన్ల ఆదాయంలో నమోదైన వృద్ధి ప్రభుత్వ పాలనా సామర్థ్యానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

Latest