Mahaa Daily Exclusive

  చెన్నైలో మోదీ, విజయ్‌ అభివృద్ధి జోడీ..! రూ.13 వేల కోట్లకు పైగా ప్రాజెక్టులకు శ్రీకారం..

Share

• రూ.13 వేల కోట్లకు పైగా ప్రాజెక్టులకు శ్రీకారం.
• మెట్రో రైల్లో ప్రయాణించిన ప్రధాని, ముఖ్యమంత్రి

చెన్నై, మహా:

తమిళనాడు రాజధాని చెన్నైలో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌ ఒకే వేదికను పంచుకున్నారు. రాష్ట్రాల ఆకాంక్షలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం ముందుంటుందని ప్రధాని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి విజయ్‌తో కలిసి తమిళనాడు అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. చెన్నై ట్రేడ్‌ సెంటర్‌, ఐఐటీ మద్రాస్‌ ప్రాంగణంలోని కేంద్రీయ విద్యాలయ మైదానంలో నిర్వహించిన కార్యక్రమాల్లో రూ.13,000 కోట్లకు పైగా విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

చెన్నై మెట్రో రెండో దశ ప్రారంభం

చెన్నై మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశలోని నాలుగో మార్గంలో పూనమల్లి నుంచి వడపళని వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర నిర్మించిన మార్గాన్ని ప్రధాని మోదీ, సీఎం విజయ్‌ ప్రారంభించారు. ఈ మార్గంలో 11 స్టేషన్లు ఉన్నాయి. అనంతరం పూనమల్లి బైపాస్‌ నుంచి పోరూర్‌ వరకు ఇద్దరు నేతలు మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ప్రయాణికులతో ముచ్చటించారు. ప్రధాని మోదీ యూపీఐ ద్వారా మెట్రో టికెట్‌ కొనుగోలు చేయడం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

తయారీ రంగంలో తమిళనాడు కీలకం

భారతదేశ తయారీ రంగం అభివృద్ధిలో తమిళనాడు కీలక పాత్ర పోషిస్తోందని ప్రధాని మోదీ ప్రశంసించారు. 2014 నుంచి దేశ ఎలక్ట్రానిక్స్‌ ఎగుమతులు 11 రెట్లు పెరిగాయని, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్‌ తయారీ దేశంగా భారత్‌ నిలిచిందని పేర్కొన్నారు. పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తి, ఎగుమతుల విస్తరణలో తమిళనాడు వంటి రాష్ట్రాల సహకారం ముఖ్యమని తెలిపారు.

తూత్తుకుడి పోర్టు విస్తరణకు భారీ ప్రణాళిక

తూత్తుకుడిలోని వి.ఓ. చిదంబరనార్‌ పోర్టును ప్రపంచస్థాయి హరిత ఇంధన కేంద్రంగా, భారీ కంటైనర్‌ రవాణా కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రూ.17,000 కోట్లతో పనులు వేగవంతం చేస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా పోర్టు సామర్థ్యం పెరగడంతో పాటు సముద్ర రవాణా, వాణిజ్య కార్యకలాపాలకు మరింత ఊతం లభించే అవకాశం ఉందని తెలిపారు.

మెట్రో విస్తరణకు విజయ్‌ విజ్ఞప్తి

తమిళనాడు అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయడం అవసరమని ముఖ్యమంత్రి విజయ్‌ పేర్కొన్నారు. చెన్నై మెట్రో మూడో దశ విస్తరణలో భాగంగా విమానాశ్రయం–కిల్‌పాక్‌, పూనమల్లి–సుంగువార్‌చత్రం మార్గాలకు తక్షణమే ఆమోదం తెలపాలని ప్రధానిని కోరారు. చెన్నై–కన్యాకుమారి, చెన్నై–కోయంబత్తూరు మార్గాల్లో అధిక వేగ రైలు కారిడార్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం సహకరించాలని కోరారు.