హైదరాబాద్, మహా.
గోవా నుంచి హైదరాబాద్‌కు సాగుతున్న మాదకద్రవ్యాల (డ్రగ్స్) సరఫరా అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను పోలీసులు భగ్నం చేశారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ విభాగమైన ‘ఈగల్ ఫోర్స్’ హైదరాబాద్ సిటీ పోలీసులు మరియు పంజాగుట్ట పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన మెరుపు దాడిలో ఈ రాకెట్‌కు ప్రధాన సూత్రధారిగా ఉన్న క్రిస్టీ (కస్టోడియో ఫెర్నాండెజ్)ను గోవాలో అదుపులోకి తీసుకున్నారు.
ఇటీవల పంజాగుట్ట పోలీసులకు పట్టుబడిన ఓ నిందితుడిని విచారించగా వెలుగులోకి వచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు ఈ ఆపరేషన్ చేపట్టారు. నార్త్ గోవాలోని కలంగ్గూట్ ప్రాంతానికి చెందిన క్రిస్టీపై నిఘా పెట్టిన ప్రత్యేక బృందాలు.. స్థానిక పోలీసుల సహకారంతో అతన్ని అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నాయి.
ఈ నెట్‌వర్క్‌కు సంబంధించి సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. నిందితుడి బ్యాంకు ఖాతాలు, ఏటీఎం లావాదేవీలను పరిశీలించగా సుమారు రూ. 48.4 లక్షల వరకు అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. ముఖ్యంగా క్రిస్టీ మొబైల్ ఫోన్ డేటాను విశ్లేషించగా.. ఆన్‌లైన్ వేదికగా తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్స్ కొనుగోలు చేసిన దాదాపు 25 మందికి పైగా వ్యక్తుల వివరాలను పోలీసులు గుర్తించారు. వీరందరిపై ప్రస్తుతం పరిశీలన (వెరిఫికేషన్) జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిరోధానికి ప్రభుత్వం అత్యంత కఠిన చర్యలు చేపడుతుండగా, ఈ అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠా అరెస్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది. నిందితుడి విచారణ ద్వారా ఈ రాకెట్‌లో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు.






