గోవా, మహా.
గోవా రాష్ట్రం ప్రస్తుతం మాదకద్రవ్యాలకు (డ్రగ్స్) అడ్డాగా మారిందని, స్థానిక ప్రజల పట్ల అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీవ్రమైన వివక్ష చూపుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన విమర్శలు చేశారు. గోవాలో పెరుగుతున్న డ్రగ్స్ సంస్కృతి పట్ల అక్కడి యువతలో తీవ్ర ఆందోళన, అసంతృప్తి వ్యక్తమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. గోవాను, అక్కడి యువత భవిష్యత్తును, భూమిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
గోవా నుంచి ఇతర రాష్ట్రాలకు ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి విసృ్తతంగా డ్రగ్స్ సరఫరా జరుగుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టకముందు హైదరాబాద్‌లో డ్రగ్స్ విచ్చలవిడిగా లభించేవని గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాదకద్రవ్యాల నియంత్రణపై అత్యంత కఠినమైన చర్యలు చేపట్టామని, డ్రగ్స్ మూలాలను ఏరిపారేసేందుకు ‘ఈగల్ ఫోర్స్’ వంటి ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి ఉక్కుపాదం మోపామని స్పష్టం చేశారు.
యువత జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్న మాదకద్రవ్యాల మహమ్మారిపై ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, గోవాలో శాంతిభద్రతలు, యువత సంక్షేమాన్ని గాలికొదిలేసిన బీజేపీ తీరును మార్చుకోవాలని రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.







