Mahaa Daily Exclusive

  ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీలక పరిణామం….

Share

ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీలక పరిణామం.
* ఏసీబీ ఛార్జ్‌షీట్‌ నుంచి పేరు తొలగించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించిన కేటీఆర్‌.
హైదరాబాద్‌, మహా.
తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) నమోదు చేసిన ఛార్జ్‌షీట్‌లో తన పేరును నిందితుల జాబితా నుంచి పూర్తిగా తొలగించాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు సోమవారం నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు.
ఫార్ములా ఈ-కార్ రేసు నిర్వహణకు సంబంధించి దర్యాప్తు పూర్తి చేసిన ఏసీబీ అధికారులు గతంలోనే న్యాయస్థానంలో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఆ ఛార్జ్‌షీట్‌లో కేటీఆర్‌ పేరును ఏ-1 (ప్రధాన నిందితుడిగా) చేర్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తనపై మోపబడిన అభియోగాల్లో ఎలాంటి చట్టపరమైన ప్రాతిపదిక లేదని, తనను ఆ నిందితుల జాబితా నుంచి విముక్తుడిని చేయాలని కోరుతూ ఆయన ఈ న్యాయపోరాటానికి దిగారు. క్రిమినల్ కేసుల్లో నిందితుడిపై విచారణ కొనసాగించడానికి తగిన ఆధారాలు లేవని భావించినప్పుడు కోర్టును ఆశ్రయించి అభియోగాల నుంచి మినహాయింపు కోరడానికి చట్టపరంగా డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది.
కేటీఆర్ తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను నాంపల్లి ఏసీబీ కోర్టు పరిశీలనకు స్వీకరించింది. దీనిపై వచ్చే నెలలో విచారణ జరిగే అవకాశం ఉందని న్యాయవర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా, ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ ఇప్పటికే రెండుసార్లు న్యాయస్థానం ఎదుట హాజరైన విషయం తెలిసిందే. తాజా డిశ్చార్జ్ పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపి ఏ విధమైన నిర్ణయం వెలువరిస్తుందనే దానిపై ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Latest