అమరావతి,మహా.
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని మొత్తం 17 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ పదవులకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసింది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ సోమవారం ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసింది. రిజర్వ్ చేయబడిన స్థానాల కేటాయింపు ప్రక్రియ పూర్తి కావడంతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది.
ప్రకటించిన రిజర్వేషన్ల వివరాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17 మేయర్ స్థానాలలో ఎస్టీలకు ఒకటి, ఎస్సీలకు రెండు, బీసీలకు ఐదు స్థానాలను కేటాయించారు. అలాగే జనరల్ మహిళలకు ఐదు కార్పొరేషన్లను కేటాయించగా, మిగిలిన నాలుగు కార్పొరేషన్ల మేయర్ పదవులను అన్‌రిజర్వ్‌డ్ (జనరల్) కేటగిరీ కింద ఉంచారు.
సామాజిక వర్గాల వారీగా కేటాయింపులను పరిశీలిస్తే.. మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానాన్ని ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. కర్నూలు మేయర్ పదవిని ఎస్సీ మహిళకు, రాజమహేంద్రవరం మేయర్ పదవిని ఎస్సీ జనరల్ కేటగిరీకి కేటాయించారు. ఇక కాకినాడ మరియు మచిలీపట్నం కార్పొరేషన్ల మేయర్ స్థానాలను బీసీ మహిళలకు కేటాయించగా, ఏలూరు, అనంతపురం, చిత్తూరు కార్పొరేషన్ల మేయర్ పదవులను బీసీ జనరల్ కేటగిరీకి కేటాయించారు.
మరోవైపు విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, కడప మరియు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ పదవులను జనరల్ మహిళలకు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక తిరుపతి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ స్థానాలను ఎలాంటి ప్రత్యేక రిజర్వేషన్లు లేకుండా అన్‌రిజర్వ్‌డ్‌గా ప్రకటించారు. మేయర్ స్థానాల రిజర్వేషన్లు తుదిరూపు సంతరించుకోవడంతో రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించేందుకు సిద్ధమవుతున్నాయి. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉండటంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.








