- నేరాల తీరు మారింది.. పోలీసింగ్ మారాలి
- నిజాయతీగా, రాగద్వేషాలకు అతీతంగా సేవలందించాలి
- విధులు ఫిట్‌నెస్, స్మార్ట్‌నెస్ తప్పనిసరి: డీజీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్, మహా : పోలీసు యూనిఫాం ధరించడం గొప్ప అదృష్టమని, ప్రజలకు సేవ చేయడంతోపాటు వారి ప్రాణాలను కాపాడే అరుదైన అవకాశం పోలీసు శాఖలో పనిచేసేవారికి లభిస్తుందని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. తెలంగాణలో నాలుగు కోట్ల జనాభాలో సుమారు 90 వేల మందికే పోలీసు యూనిఫాం ధరించే అవకాశం ఉందని, ఇది మొత్తం జనాభాలో 0.3 శాతం మాత్రమేనని వివరించారు. ప్రతిరోజూ కనీసం 50 మంది కన్నీళ్లు తుడిచే అవకాశం పోలీసులకు ఉంటుందని పేర్కొన్నారు. నిజాయితీ, నైతిక విలువలను విస్మరించరాదని, కుల, మత, రాజకీయ రాగద్వేషాలకు అతీతంగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. తెలంగాణ పోలీసు అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న 112 మంది డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2014 తర్వాత పూర్తిస్థాయిలో శిక్షణ ముగించుకుని బయటకు వస్తున్న తొలి డీఎస్పీ బ్యాచ్ కావడంతో దీనికి ప్రత్యేకత ఉందన్నారు. 44 వారాలపాటు చట్టాలు, దర్యాప్తు విధానాలు, ఔట్‌డోర్ శిక్షణ, క్రీడల్లో శిక్షణ పొందిన అధికారులను అభినందించారు. శిక్షణలో ప్రతిభ కనబరిచిన వారిని ప్రశంసిస్తూ, అకాడమీ అధికారులు, అధ్యాపకులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.
30 ఏళ్ల వృత్తి జీవితానికి పునాది
పాసింగ్ అవుట్ పరేడ్ సందర్భంగా చేసే ప్రమాణం అధికారుల 30–35 ఏళ్ల వృత్తి జీవితానికి మార్గదర్శకంగా నిలవాలని డీజీపీ సూచించారు. రాజ్యాంగం పట్ల నిబద్ధతతో, ప్రజలకు నిజాయతీగా, రాగద్వేషాలకు అతీతంగా విధులు నిర్వహిస్తానని చేసిన ప్రమాణాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలన్నారు. అకాడమీలో శిక్షణ పూర్తయిన తర్వాత మరో 46 వారాలపాటు క్షేత్రస్థాయిలో శిక్షణ ఉంటుందని తెలిపారు. ఈ దశలోనూ అదే శ్రద్ధ, క్రమశిక్షణ, నిజాయతీతో వ్యవహరించాలని సూచించారు. తన 35 ఏళ్ల పోలీసు అనుభవంలో నేర్చుకున్న అంశాలను గతంలో డీఎస్పీలతో నిర్వహించిన ముఖాముఖిలో వివరించానని, నాయకత్వ లక్షణాల ప్రాధాన్యాన్ని మరోసారి గుర్తుచేస్తున్నానని చెప్పారు.
నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి
మీరు నాయకులుగా ఎంపికయ్యారు.. మీ నాయకత్వ లక్షణాలను విధుల్లో నిరూపించుకోవాలన్నారు. ధైర్యం, దార్శనికత, నైతిక విలువలు, నిష్పాక్షికత, బృంద స్ఫూర్తి, సంభాషణ నైపుణ్యాలు, కష్టపడే తత్వం, సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆలోచనలు, వినయం.. ఈ పది లక్షణాలను ప్రతి అధికారి అలవర్చుకోవాలని సూచించారు. విధుల నిర్వహణలో నైతిక విలువలను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించరాదన్నారు.
నేరాల తీరు మారింది.. పోలీసింగ్ మారాలి
తాము యూనిఫాం ధరించిన రోజుల్లో నక్సలిజం ప్రధాన సవాలుగా ఉండేదని, ఆ సమస్యను పోలీసులు సమర్థంగా ఎదుర్కొన్నారని డీజీపీ గుర్తుచేశారు. ప్రస్తుతం సైబర్ నేరాలు, వ్యవస్థీకృత నేరాలు, రోడ్డు భద్రత, ఇతర కొత్త తరహా సవాళ్లు పోలీసుల ముందున్నాయని తెలిపారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పోలీసు శాఖలో సంస్థాగత మార్పులు చేపట్టామని చెప్పారు. గ్రేహౌండ్స్ తదితర విభాగాల పునర్వ్యవస్థీకరణతోపాటు ఈగల్ ఫోర్స్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో, టీజీ ఫాస్ట్, టీజీ స్పార్క్ వంటి విభాగాలను బలోపేతం చేసి కొత్త సవాళ్లను ఎదుర్కొనేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులు కూడా ఈ మార్పులకు అనుగుణంగా సిద్ధంగా ఉండాలని సూచించారు.
ఫిట్‌నెస్, స్మార్ట్‌నెస్ తప్పనిసరి
పోలీసు శాఖలో శారీరక దారుఢ్యం, చురుకుదనం, వృత్తిపరమైన నైపుణ్యాలు అత్యంత ముఖ్యమని డీజీపీ అన్నారు. యూనిఫాం ధరించిన తొలిరోజు ఉన్న ఉత్సాహం, క్రమశిక్షణ, ఫిట్‌నెస్ 30 ఏళ్ల తర్వాత కూడా కొనసాగాలని ఆకాంక్షించారు. పోలీసు పాసింగ్ అవుట్ పరేడ్‌లో బెల్టుపై ఉన్న హోల్ (రంధ్రం) 30 ఏళ్ల సర్వీసు పూర్తయ్యే వరకు, ఉద్యోగ విరమణ చేసేంతవరకు అలాగే ఉండాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలందిస్తూ, సమర్థవంతమైన నాయకులుగా ఎదగాలని డీఎస్పీలకు పిలుపునిచ్చారు.
112 సంఖ్యకు ప్రత్యేక అనుబంధం: అకాడమీ డైరెక్టర్
తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ మాట్లాడుతూ.. 112 సంఖ్యకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందన్నారు. ప్రజల అత్యవసర సేవల కోసం తెలంగాణ పోలీసు వ్యవస్థలో 112 సేవలు అందుబాటులో ఉన్నాయని, ఇప్పుడు 112 మంది డీఎస్పీలు ప్రజా సేవలోకి అడుగుపెట్టడం విశేషమని పేర్కొన్నారు. వీరిలో 74 మంది పురుషులు, 38 మంది మహిళలు ఉన్నారు. మల్టీజోన్-1 నుంచి 51 మంది, మల్టీజోన్-2 నుంచి 61 మంది ఎంపికయ్యారు. విద్యార్హతల పరంగా 79 మంది డిగ్రీ పట్టభద్రులు, 31 మంది పీజీ పూర్తి చేసినవారు ఉన్నారు. మరో ఇద్దరిలో ఒకరు ఎంబీబీఎస్, మరొకరు బీడీఎస్ పట్టా పొందారు. ఈ బ్యాచ్‌లో గతంలో రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసినవారు 45 మంది, కేంద్ర ప్రభుత్వంలో పనిచేసినవారు 12 మంది ఉండగా.. కొత్తగా ఉద్యోగ జీవితంలోకి అడుగుపెడుతున్నవారు 55 మంది ఉన్నారు. గతంలో పోలీసు శాఖలో ఎస్సైలుగా పనిచేసిన నలుగురు ప్రస్తుతం డీఎస్పీలుగా ఎంపికయ్యారు. శిక్షణ పొందుతూనే 2026లో యూపీఎస్సీ పరీక్షల్లో జి.సృజన 55వ ర్యాంకు, డి.ప్రవీణ్‌కుమార్ 795వ ర్యాంకు సాధించడం విశేషం. ఆరు వారాల ఫౌండేషన్ శిక్షణను డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో అందించినట్లు చెప్పారు. అకాడమీ నినాదమైన నాలెడ్జ్, స్కిల్, ఆటిట్యూడ్ ఆధారంగా అధికారులకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. క్షేత్రస్థాయి అనుభవం కల్పించేందుకు మేడారం జాతర, వినాయక చవితి, ఇతర ప్రధాన కార్యక్రమాల్లో విధులు నిర్వహించే అవకాశం కల్పించామన్నారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఈగల్ వంటి విభాగాలతో శిక్షణ ఇచ్చినట్లు వివరించారు. పోలీసుల విధి ప్రజలకు న్యాయం చేయడమేనని, వారి పనితీరును బట్టే ప్రజలు వారిని అంచనా వేస్తారని అన్నారు.
నేహా అగర్వాల్‌కు సీఎం రివాల్వర్…..9 విభాగాల్లో ఉత్తమ ప్రతిభకు ట్రోఫీలు, పతకాలు
పోలీస్ శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నేహా అగర్వాల్ ముఖ్యమంత్రి రివాల్వర్‌తో పాటు మరో మూడు పురస్కారాలను అందుకున్నారు. బెస్ట్ ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్‌కు సీఎం రివాల్వర్, రాజా బహదూర్ వెంకట రామారెడ్డి బంగారు పతకం, కోన రామచంద్రారెడ్డి స్మారక బంగారు పతకం, ఇండోర్ సబ్జెక్టుల్లో ప్రతిభకు హోంమంత్రి బేటన్ ఆమెకు లభించాయి. రాజా బహదూర్ వెంకట రామారెడ్డి బంగారు పతకంతో పాటు రూ.5,000 నగదు బహుమతి కూడా అందుకున్నారు. ఇతర విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారిలో ఔట్‌డోర్ సబ్జెక్టుల్లో ఎల్. శ్రీకాంత్ డీజీపీ ట్రోఫీ, ఫైరింగ్‌లో టి. జాకబ్ అభిషేక్ ఉత్తమ పురస్కారం అందుకున్నారు. ఫోరెన్సిక్ సైన్స్‌లో డి. చందన, క్రిమినాలజీలో చి. ఆది శేషు రెడ్డి ఎన్‌ఐసీఎఫ్‌ఎస్ పతకాలు సాధించారు. దర్యాప్తులో ఉత్తమ ప్రతిభకు ఆర్. సాయి కిరణ్ రెడ్డి డైరెక్టర్ పతకాన్ని దక్కించుకున్నారు.
చట్టాల నుంచి సైబర్ నేరాల దర్యాప్తు వరకు
44 వారాల సంస్థాగత శిక్షణలో భాగంగా ఇండోర్, అవుట్‌డోర్ అంశాలను రెండు సెమిస్టర్లుగా విభజించారు. ఇండోర్ శిక్షణలో పోలీసు వ్యవస్థ, నేరశాస్త్రం, నేరాల నివారణ, మానవ హక్కులు, భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య అధినియం, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, ఫోరెన్సిక్ సైన్స్, నాయకత్వం, నిర్వహణ వంటి అంశాలను బోధిస్తున్నారు. శారీరక నేరాలు, ఆస్తి సంబంధ నేరాలు, సైబర్ నేరాలు, ఆర్థిక మోసాల దర్యాప్తు విధానాలపైనా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అంతర్గత భద్రత, శాంతిభద్రతల నిర్వహణపై అవగాహన కల్పిస్తున్నారు.
ఆయుధ వినియోగం.. క్షేత్రస్థాయి నైపుణ్యాలు
అవుట్‌డోర్ శిక్షణలో శారీరక వ్యాయామాలు, డ్రిల్, పరేడ్, ఆయుధ వినియోగం, కాల్పులు, ఫీల్డ్‌క్రాఫ్ట్, మ్యాప్ రీడింగ్, వ్యూహాత్మక విధానాలు, వీఐపీ భద్రత, పేలుడు పదార్థాలు, ఐఈడీల నిర్వహణ వంటి అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. స్విమ్మింగ్, ప్రథమ చికిత్స, అంబులెన్స్ డ్రిల్, వాహనాల డ్రైవింగ్, విపత్తుల నిర్వహణ, అగ్నిమాపక చర్యలు, క్రీడలకూ ప్రాధాన్యం ఇచ్చారు.
పాసింగ్ అవుట్ పరేడ్‌లో సీనియర్ పోలీసు అధికారులు, రిటైర్డ్ పోలీసు అధికారులు, అకాడమీ సిబ్బంది, శిక్షణ పొందిన డీఎస్పీల కుటుంబ సభ్యులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.








