Mahaa Daily Exclusive

  ఎన్నికలకు లైన్‌ క్లియర్‌….

Share

ఎన్నికలకు లైన్‌ క్లియర్‌.
* ఏపీలో మున్సిపల్ పీఠాల రిజర్వేషన్ల ఖరారు.
* 106 మున్సిపాలిటీల చైర్‌పర్సన్‌ పదవుల రిజర్వేషన్లు విడుదల.
* బీసీలకు 36, ఎస్సీలకు 14, ఎస్టీలకు 3 స్థానాలు కేటాయింపు!
* రిజర్వేషన్ల ప్రకటనతో ఊపందుకున్న రాజకీయ వేడి!

అమరావతి, మహా.

ఆంధ్రప్రదేశ్‌లో పురపాలక ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. రాష్ట్రంలోని 106 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల చైర్‌పర్సన్‌ పదవులకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసింది. ఈ మేరకు సోమవారం మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తాజా ప్రకటనతో పురపాలక ఎన్నికలకు స్పష్టమైన అడుగు పడినట్లయింది.
మొత్తం స్థానాల కేటాయింపులో వెనుకబడిన తరగతులకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. రాష్ట్రవ్యాప్తంగా బీసీ కేటగిరీకి అత్యధికంగా 36 మున్సిపాలిటీలను కేటాయించారు. ఇందులో 18 స్థానాలను మహిళలకు కేటాయించగా, మరో 18 స్థానాలను జనరల్‌ కేటగిరీకి కేటాయించారు. బీసీ మహిళా విభాగంలో చిలకలూరిపేట, ఇచ్ఛాపురం, కొవ్వూరు, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం, నర్సీపట్నం, నాయుడుపేట, గుంతకల్లు, గుడివాడ, నందిగామ, నెల్లిమర్ల, మడకశిర, ఆళ్లగడ్డ, గురజాల, ముమ్మిడివరం, మదనపల్లె, నరసరావుపేట, అమలాపురం మున్సిపాలిటీలు ఉన్నాయి. అలాగే బీసీ జనరల్‌ కేటగిరీలో కావలి, కదిరి, బి.కొత్తకోట, కందుకూరు, హిందూపురం, ఆత్మకూరు, అద్దంకి, కమలాపురం, దాచేపల్లి, గొల్లప్రోలు, మార్కాపురం, నంద్యాల, బేతంచెర్ల, నందికొట్కూరు, దర్శి, గూడూరు, మైదుకూరు, బద్వేలు మున్సిపాలిటీలు దక్కాయి.
ఇక జనరల్‌ మహిళా కేటగిరీకి ప్రత్యేకంగా 27 మున్సిపాలిటీలను కేటాయించారు. ఈ జాబితాలో కనిగిరి, వెంకటగిరి, బుచ్చిరెడ్డిపాలెం, ఎర్రగుంట్ల, యలమంచిలి, కల్యాణదుర్గం, నరసాపురం, పలాస-కాశీబుగ్గ, పెడన, పలమనేరు, జమ్మలమడుగు, ఆకివీడు, పాలకొండ, పొన్నూరు, భీమవరం, జగ్గయ్యపేట, ఆమదాలవలస, పుంగనూరు, మాచర్ల, రాజంపేట, ఆదోని, డోన్‌, రాజాం, బొబ్బిలి, రేపల్లె, పులివెందుల, ఎమ్మిగనూరు ప్రాంతాలు చోటుచేసుకున్నాయి.
షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) కేటగిరీకి మొత్తం 14 స్థానాలు దక్కగా, వాటిలో ఏడు స్థానాలను మహిళలకు, మరో ఏడు స్థానాలను జనరల్‌ కేటగిరీకి కేటాయించారు. మహిళల కోసం చింతలపూడి, సూళ్లూరుపేట, కొండపల్లి, నిడదవోలు, ఏలేశ్వరం, గుత్తి, చీరాల మున్సిపాలిటీలను ఎంపిక చేయగా, జనరల్‌ విభాగంలో ఉయ్యూరు, సామర్లకోట, పిఠాపురం, నూజివీడు, కుప్పం, పొదిలి, బాపట్ల స్థానాలను చేర్చారు. షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) కేటగిరీలో మొత్తం మూడు మున్సిపాలిటీలను కేటాయించగా, గూడూరును మహిళకు రిజర్వు చేయగా, ఆలూరు, ఆత్మకూరు స్థానాలను జనరల్‌ కేటగిరీకి కేటాయించారు. మిగిలిన 26 స్థానాలను ఎలాంటి రిజర్వేషన్లు లేని అన్‌రిజర్వుడ్‌ కేటగిరీ కింద ఉంచారు.
ఈ రిజర్వేషన్ల ప్రకటన వెలువడటంతో ఆయా పురపాలక సంఘాల్లో పోటీ చేయాలని భావిస్తున్న అభ్యర్థులు, స్థానిక నాయకులు తమ రాజకీయ కార్యాచరణను వేగవంతం చేశారు. ఏ స్థానం ఏ వర్గానికి రిజర్వు అయిందనే దానిపై స్పష్టత రావడంతో ఆశావాహులు లెక్కలు వేసుకుంటున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలు కూడా స్థానిక సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల బలాబలాలు, గెలుపు ఓటముల బేరీజుపై దృష్టి సారించాయి. రాబోయే రోజుల్లో వార్డుల రిజర్వేషన్లు, ఎన్నికల షెడ్యూల్‌, నామినేషన్ల స్వీకరణకు సంబంధించిన అధికారిక ప్రకటనలు వెలువడిన తర్వాత మున్సిపల్‌ ఎన్నికల సమరం మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది.

Latest