- ఎస్ఐఆర్పై రాహుల్ గాంధీ పిటిషన్
- ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు
- నిరసన వేదికగా జంతర్ మంతర్ తొలగింపు పిటిషన్‌పైనా సుప్రీంకోర్టు నోటీసులు
- సీసీటీవీ దృశ్యాలను భద్రపరచాలని ధర్మాసనం ఆదేశం
న్యూఢిల్లీ, మహా : ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో భారీగా ఓట్ల తొలగింపు, అక్రమాలు జరిగాయంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఎస్ఐఆర్ వ్యవహారంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్ష నేతలు ఇటీవల సుప్రీంకోర్టుకు ర్యాలీగా వెళ్లి ఉమ్మడి పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చితో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సమాధానం ఇవ్వాలని ఆదేశించారు.
ఎస్ఐఆర్ ప్రక్రియలో జరిగిన ఓట్ల తొలగింపులు, మార్పులపై స్వతంత్రంగా ఆడిట్ నిర్వహించాలని ప్రతిపక్ష నేతలు కోరారు. ఇందుకోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో సాంకేతిక నిపుణులు, ప్రముఖ పౌరులతో కూడిన స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. ఎలాంటి ఓటరునైనా ముందస్తు నోటీసు ఇవ్వకుండా, తన వాదన వినిపించే అవకాశం కల్పించకుండా ఓటర్ల జాబితా నుంచి తొలగించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పంజాబ్‌తో పాటు ఎన్నికలు జరగనున్న ఇతర రాష్ట్రాల్లో అర్హులైన ఓటర్లు చట్టం అనుమతించిన చివరి తేదీ వరకు తమ పేర్లను నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. పిటిషన్‌పై తుది నిర్ణయం వెలువడే వరకు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలని కూడా అభ్యర్థించారు.
విచారణ సందర్భంగా, ఈ పిటిషన్లో సహ-పిటిషనర్‌గా ఉన్న జార్ఖండ్ ముక్తి మోర్చా నేత మహువా మాజీ చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆమెకు ప్రొవిజనల్ నోటీసు ఇస్తూ, “ఆమె చేసిన వ్యాఖ్యలు, ప్రవర్తనపై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది” అని కోర్టు స్పష్టం చేసింది. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అఖిలేశ్ యాదవ్, తేజస్వీ ప్రసాద్ యాదవ్, సౌగతా రాయ్, సుప్రియా సూలే, సంజయ్ రౌత్, డి.రాజా తదితరులు ఈ పిటిషన్లో సహ పిటిషనర్లుగా ఉన్నారు.
14 సార్లు విభేదాలు వచ్చినట్లు కథనాలు
గత 10 నెలల్లో సీఈసీ జ్ఞానేష్ కుమార్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలపై మిగతా ఇద్దరు కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషి ఏకంగా 14 సందర్భాల్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు ఒక జాతీయ పత్రిక ప్రచురించిన కథనాన్ని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 2025 జూన్‌లో ‘సర్’ ప్రక్రియను ప్రారంభించడానికి తీసుకున్న వివాదాస్పద నిర్ణయంతో పాటు, ఆయా సమావేశాల ఎజెండా, మినిట్స్, ఫైళ్లు, ఆమోదించిన ప్రతిపాదనల రికార్డులన్నింటినీ కోర్టు ముందు ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీకి డిమాండ్
ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాలు, విధానాలు, ప్రాసెస్, ఈవీఎంల సాంకేతిక వ్యవస్థను క్షుణ్ణంగా పరిశీలించేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఒక స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని నేతలు విజ్ఞప్తి చేశారు. ఇందులో సాంకేతిక నిపుణులు, పౌరసమాజ ప్రతినిధులను కూడా సభ్యులుగా చేర్చాలని ప్రతిపాదించారు. దీంతో పాటు ఓటర్ల నమోదు నిబంధనలు 1960ని సవరించకుండానే ఫారమ్-6 మార్పులు చేయడం, ఈసీఐ నెట్, ఈఆర్ఓ నెట్ డేటాబేస్‌ల కేంద్రీకృత నిర్వహణ, తగిన నోటీసులు ఇవ్వకుండా అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడంపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఎన్నికల సంఘం స్వతంత్రత, కలెక్టివ్ నిర్ణయాల ప్రక్రియ రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో భాగమని, వీటి ఉల్లంఘనకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని న్యాయవాది ఎస్. ప్రసన్న ద్వారా దాఖలైన ఈ పిటిషన్లో కోరారు.
మరోవైపు, జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా గుర్తించిన హోదాను తొలగించడాన్ని సవాలు చేస్తూ స్వాతి సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌పైనా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ప్రాంగణంతో పాటు సంబంధిత ప్రాంతాల్లోని సీసీటీవీ దృశ్యాలను భద్రపరచాలని ఆదేశించింది. అక్టోబర్ 10న ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల నేపథ్యంలో నిరసనలు, మెట్రో స్టేషన్ల మూసివేత, రైళ్ల రాకపోకలకు అంతరాయాలపై దాఖలైన ఇతర పిటిషన్లను కూడా ధర్మాసనం విచారించింది.







