- పోలీస్ అధికారులపై అవినీతి కేసులు క్లోజ్
- ఏసీబీ విజ్ఞప్తికి నాంపల్లి కోర్టు ఆమోదం
- 2023 నుంచి 22 కేసులు మూసివేత
హైదరాబాద్, మహా : తెలంగాణలో ప్రభుత్వ అధికారులపై నమోదైన అవినీతి కేసుల దర్యాప్తు, తదుపరి చర్యలపై మరోసారి చర్చ మొదలైంది. అవినీతి నిరోధక శాఖ గత వారం వ్యవధిలో పోలీసు సిబ్బందికి సంబంధించిన రెండు కేసులను మూసివేయడానికి కోర్టు అనుమతి పొందింది. 2023 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వ అధికారులపై నమోదైన సుమారు 22 అవినీతి కేసులు మూసివేత దశకు చేరినట్లు సమాచారం. తాజాగా మూసివేసిన కేసుల్లో ఒకటి ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించినది కాగా.. మరొకటి పబ్ యజమాని నుంచి లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలకు సంబంధించినది. ఈ రెండు కేసుల్లోనూ నిందితులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్కు బదులుగా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఏసీబీ కోర్టును ఆశ్రయించింది.
మొదటి కేసు విషయానికి వస్తే.. సిటీ కమిషనరేట్లో పనిచేస్తూ ఇబ్రహీంబాగ్లోని ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లాలో నివసిస్తున్న ఓ ఎస్పీ క్యాడర్ అధికారిపై 2019లో అక్రమాస్తుల కేసు నమోదైంది. నాటి విచారణలో ఆయనకు రూ.1.86 కోట్ల ఆదాయం ఉండగా.. రూ.3.25 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు తేలింది. అంటే ఆదాయానికి మించి 174 శాతం అక్రమాస్తులు ఉన్నట్లు ఏసీబీ రంగారెడ్డి రేంజ్ యూనిట్ నిర్ధారించి ఆయనను ప్రాసిక్యూట్ చేయాలని 2023 నవంబర్ 23న ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అయితే, సదరు అధికారిపై మోపబడిన ఆరోపణలను సహేతుకమైన ఆధారాలతో నిరూపించలేమని పేర్కొంటూ ప్రభుత్వం 2026 ఏప్రిల్ 20న ప్రాసిక్యూషన్కు నిరాకరించింది. ఆ అధికారి కౌంటర్ టెర్రరిజం, ఇంటెలిజెన్స్ విభాగాల్లో అందించిన రిస్కీ సర్వీస్ను పరిగణనలోకి తీసుకుని అనుమతి లేకుండా ఆస్తులను కొనడం, వార్షిక ఆస్తుల వివరాలను సమర్పించకపోవడం వంటి విధి నిర్వహణ లోపాలపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటే సరిపోతుందని ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగా ఏసీబీ దాఖలు చేసిన ఫైనల్ క్లోజర్ రిపోర్టును అక్టోబర్ 9న కోర్టు ఆమోదించింది.
రెండో కేసులో.. 2023లో ఒక పబ్ యజమానిని లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలపై ఒక ఇన్స్పెక్టర్, సబ్ఇన్స్పెక్టర్ , హోంంగార్డ్లపై కేసు నమోదైంది. అయితే వీరిని ప్రాసిక్యూట్ చేసే బదులు తెలంగాణ సివిల్ సర్వీసెస్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఇన్స్పెక్టర్, ఎస్ఐలపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఏసీబీ సిఫార్సు చేసింది. ప్రభుత్వం కూడా జూలై 15, 2025న శాఖాపరమైన చర్యలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక హోంగార్డుపై అవసరమైన చర్యలు తీసుకుని తొలగించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు ఇవ్వడంతో ఈ కేసు క్లోజర్ రిపోర్టును కూడా అక్టోబర్ 8న నాంపల్లి ఏసీబీ కోర్టు ఆమోదించింది.
ఈ పరిణామాలు అవినీతి ఆరోపణలపై క్రిమినల్ ప్రాసిక్యూషన్, శాఖాపరమైన చర్యల మధ్య ఉన్న తేడాపై చర్చకు దారితీస్తున్నాయి. ఈ రెండు కేసుల్లోనూ ప్రభుత్వ నిర్ణయాల ఆధారంగా ఏసీబీ మూసివేత నివేదికలు దాఖలు చేయగా.. వాటికి కోర్టు ఆమోదం తెలిపింది. అంటే అవినీతికి పాల్పడినట్లు తేలినా.. చర్యలు తీసుకోకపోవటం చర్చకు దారితీశాయి.








