Mahaa Daily Exclusive

  తెలంగాణపై తుఫాన్ ప్రభావం ఈనెల 27 నుంచి వర్షాలు

Share

  • పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

హైదరాబాద్, మహా : బంగాళాఖాతంలోని అల్పపీడనం సోమవారం నాటికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. శనివారం ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఇదే సమయంలో నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల, వనపర్తి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లోని వివిక్త ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది,

అక్టోబర్ 24 ఉదయం నుంచి అక్టోబర్ 26 ఉదయం వరకు చూస్తే ఈ మూడు రోజుల వ్యవధిలో తెలంగాణవ్యాప్తంగా ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఈ రోజుల్లో వాతావరణ శాఖ ఎలాంటి వర్ష హెచ్చరికలు జారీ చేయలేదు. అక్టోబర్ 27వ తేదీ నుంచి రాష్ట్రంలో మళ్లీ వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. 28వ తేదీన పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే సూచనలుండగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం మోస్తారు నుంచి భారీ వర్షాలు పడొచ్చు. అక్టోబర్ 29, 30 తేదీల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే సూచనలున్నాయి. ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. తుఫాన్ ప్రభావాన్ని బట్టి వాతావరణ పరిస్థితుల్లో మరిన్ని మార్పులు ఉండొచ్చని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈ ప్రభావంతో మరిన్ని జిల్లాల్లో కూడా వర్షాలు ఉండవచ్చు.