- పోలీసుల అడ్డగింతతో కిందపడ్డ మాజీ మంత్రి విడదల రజిని!
చిలకలూరిపేట, మహా.
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. నామినేషన్ల ప్రక్రియలో అధికార కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ బయటకు వెళ్లేందుకు యత్నించిన వైయస్సార్సీపీ అగ్రనేత, మాజీ మంత్రి విడదల రజినిని పోలీసులు గృహనిర్బంధం చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆమెను ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకోవడంతో పాటు, నివాస గేటు వద్దే యడ్లపాడు జడ్పీటీసీ అభ్యర్థి బుల్లబ్బాయిని కూడా నిలిపివేయడం కలకలం రేపింది. ఈ క్రమంలో పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రజినికి, అధికారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
తన వారిని ఇంట్లోకి ఎందుకు అనుమதించడం లేదని మాజీ మంత్రి విడదల రజిని పోలీసులను నిలదీశారు. ఈ సమయంలో పరిస్థితి మరింత ఉద్రిక్తతంగా మారింది. చిలకలూరిపేట రూరల్ ఎస్సై ప్రియాంక ఆమెను అడ్డుకునేందుకు యత్నించగా, ఇరువర్గాల మధ్య జరిగిన తోపులాటలో మాజీ మంత్రి రజిని కిందపడిపోయారు. వైయస్సార్సీపీ అభ్యర్థులను ఎక్కడికక్కడ నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఈ సందర్భంగా ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ అధికార పార్టీకి కొమ్ముకాయడం సరికాదని మండిపడ్డారు.
కూటమి ప్రభుత్వంపై విడదల రజిని తీవ్ర విమర్శలు
ఇదిలా ఉండగా, అంతకుముందు గురువారం మీడియాతో మాట్లాడిన విడదల రజిని కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో టీడీపీ గూండాలు బరితెగించి నామినేషన్లకు వెళ్తున్న వైయస్సార్సీపీ అభ్యర్థులపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇళ్లలోకి దూరి మరీ అభ్యర్థులను లాక్కొచ్చి నామినేషన్లు విత్డ్రా చేయిస్తుంటే రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏం చేస్తోందని ఆమె నిలదీశారు. చిలకలూరిపేటలో టీడీపీ దాడులకు దిగుతుంటే, బెదిరించి నామినేషన్లు రద్దు చేయిస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆక్షేపించారు. అర్ధరాత్రి 12 గంటల వరకు మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు విత్డ్రా చేయించిన అక్రమాలపై ఎస్ఈసీని కలిసి పూర్తి ఆధారాలు సమర్పించామని, దీనిపై తగు చర్యలు తీసుకోకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయం కోరతామని రజిని గట్టిగా హెచ్చరించారు.
రాష్ట్రంలో ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ అమలు చేస్తూ స్థానిక ఎన్నికల్లో దాడులు, అరాచకాలకు పాల్పడుతున్న వైనం అందరూ చూస్తున్నారని రజిని విమర్శించారు. ఈ రెడ్ బుక్ ఎలక్షన్ అజెండా ఒక్కటేనని, కూటమి అభ్యర్థులు కనీసం పోటీ కూడా పడకుండానే వారే సుప్రీం అనుకుని ఏకగ్రీవం కావాలని డిక్లరేషన్ చేసుకోవడమే ఈ విధానం ఉద్దేశమని ఎద్దేవా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా విపక్ష అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకోవడం, వారి కుటుంబ సభ్యులను, చిన్నారులను వేధించడం నిత్యకృత్యమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని ఇబ్బందులు పెడుతున్నప్పటికీ, దాడులకు తెగబడుతున్నప్పటికీ ఎక్కడా వెనక్కి తగ్గకుండా పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డిపై ఉన్న అభిమానంతో బరిలోకి దిగుతున్న అభ్యర్థుల ధైర్యాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువేనని పేర్కొంటూ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు.








