- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక
- డీఏ 3 శాతం పెంపు
- 63 శాతానికి చేరిన అలవెన్స్!
- మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం
న్యూఢిల్లీ, మహా : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. 7వ వేతన సంఘం కింద ఉద్యోగులకు ఇచ్చే డీఏ, పెన్షనర్లకు ఇచ్చే కరువు భత్యం (డీఏర్)ను 3 శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్ కీలక ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. తాజా నిర్ణయంతో ప్రస్తుతం 60 శాతంగా ఉన్న డీఏ ఒకేసారి 63 శాతానికి ఎగబాకింది. పెరిగిన నూతన రేట్లు 2026 జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ పెంపు ద్వారా కేంద్ర ఖజానాపై ఏటా దాదాపు రూ.10,016 కోట్ల అదనపు భారం పడనుందని ప్రభుత్వం అంచనా వేసింది.
48 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి
ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా సుమారు 48 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరనుంది. ఉద్యోగి మూల వేతనం ఆధారంగా ఈ పెంపు ఉంటుంది. ఉదాహరణకు నెలకు రూ.18,000 కనీస మూల వేతనం తీసుకునే ఉద్యోగికి డీఏ నెలకు రూ.540 పెరిగి, ఏడాదికి రూ.6,480 అదనంగా అందుతుంది. అలాగే రూ.30,000 మూల వేతనం ఉన్నవారికి నెలకు రూ.900, రూ.40,000 బేసిక్ పే ఉన్నవారికి నెలకు రూ.1,200 అదనంగా లభిస్తాయి.






