Mahaa Daily Exclusive

  సారీ … అలా మాట్లాడి ఉండాల్సింది కాదు…

Share

  • సారీ … అలా మాట్లాడి ఉండాల్సింది కాదు
  • కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలపై చింతిస్తున్నా
  • మాజీ మంత్రి కొండా సురేఖ
  • వ్యాఖ్యల ఉపసంహరణ వెనుక న్యాయస్థానాల భయమే కారణమా ?

హైదరాబాద్, మహా : బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై గతంలో చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను మాజీ మంత్రి కొండా సురేఖ ఉపసంహరించుకున్నారు. ఆ వ్యాఖ్యలు నిరాధారమైనవని, అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని పేర్కొంటూ సోషల్‌ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు. తన మాటల వల్ల కేటీఆర్‌ లేదా ఆయన కుటుంబ సభ్యులు బాధపడి ఉంటే చింతిస్తున్నట్లు తెలిపారు. వారిని ఉద్దేశపూర్వకంగా బాధపెట్టాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు కేటీఆర్‌ను ఉద్దేశించి ఆమె చేసిన తాజా ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

‘బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ గారిపై గతంలో నేను చేసిన కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యల పట్ల వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను. అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో ఆ విధంగా మాట్లాడానే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదు. ఆనాడు నేను చేసిన కొన్ని నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండవలసింది. కేటీఆర్‌ గారిని లేదా ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలని గానీ, వారి ప్రతిష్ఠకు భంగం కలిగించాలనే దురుద్దేశం గానీ నాకు ఎంతమాత్రం లేవు. నా వ్యాఖ్యలు వారిని గానీ, వారి కుటుంబ సభ్యులను గానీ నొప్పించి ఉంటే అందుకు చింతిస్తూ.. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను’ అని కొండా సురేఖ ట్వీట్ చేశారు.

కాగా, గతంలో మంత్రిగా ఉన్న సమయంలో మీడియాతో మాట్లాడిన కొండా సురేఖ కేటీఆర్‌పై తీవ్ర వ్యక్తిగత ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో సినీ ప్రముఖుల ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని, సినీ నటుల వ్యక్తిగత జీవితాల్లో చోటుచేసుకున్న పరిణామాలకు కేటీఆర్‌ కారణమంటూ ఆరోపణలు చేశారు. ప్రముఖ సినీ జంట నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారాన్ని కూడా ఈ వ్యాఖ్యల్లో ప్రస్తావించారు. అంతేకాకుండా సినీ ప్రముఖులను డ్రగ్స్‌కు అలవాటు చేశారంటూ కేటీఆర్‌పై ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి.

తనపై చేసిన ఆరోపణలను కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తన వ్యక్తిత్వం, కుటుంబ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కొండా సురేఖ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తూ ఆమెకు లీగల్ నోటీసులు పంపించారు. అనంతరం తన ప్రతిష్ఠకు నష్టం కలిగించారంటూ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో రూ.100 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ వివాదంపై సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు, అక్కినేని కుటుంబ సభ్యులు కూడా అప్పట్లో తీవ్రంగా స్పందించారు.

తాజాగా కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటూ విచారం వ్యక్తం చేయడంతో ఈ వివాదం మరోసారి వార్తల్లోకి వచ్చింది. అయితే కొండా సురేఖను ఇటీవల మంత్రివర్గం నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. సురేఖ కూతురు కొండా సుస్మిత రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు గానూ ఆమెపై అధిష్ఠానం వేటు వేసింది. దీంతో కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అందుకే కేటీఆర్‌పై గతంలో చేసిన కామెంట్స్‌కు ఇప్పుడు సారీ చెబుతున్నారంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

క్షమాపణ న్యాయస్థానాల భయం.. లీగల్ వ్యూహం

సడన్‌గా సురేఖ దిగివచ్చి విచారం వ్యక్తం చేయడం వెనుక రాజకీయం కంటే పక్కా లీగల్ ప్లాన్ దాగి ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ అకస్మాత్తు క్షమాపణ వెనుక ప్రజాప్రతినిధుల కోర్టులో వేలాడుతున్న క్రిమినల్ పరువు నష్టం కేసుల ముప్పు తప్పించుకునే తీవ్ర ప్రయత్నమే ప్రధాన కారణమని స్పష్టమవుతోంది. నాడు సినీ నటులు నాగచైతన్య, సమంత విడాకుల అంశాన్ని డ్రగ్స్ వ్యవహారాలతో ముడిపెడుతూ కేటీఆర్‌పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేత నాంపల్లి కోర్టులో సవాల్ చేశారు. ఆధారాల్లేకుండా ఒక మంత్రి హోదాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడటంపై కోర్టు క్రిమినల్ ప్రొసీడింగ్స్ స్వీకరించి, నేరం రుజువైతే జైలు శిక్ష పడే అవకాశం, ప్రజాప్రతినిధిగా అనర్హత వేటు పడే ప్రమాదం పొంచి ఉండటంతో.. శిక్ష నుంచి తప్పించుకోవడానికి అపోలజీ కార్డ్ అనే న్యాయ రక్షణ అస్త్రాన్ని సురేఖ ప్రయోగించినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి నాంపల్లి కోర్టు మెట్లు ఎక్కకుండా కొండా సురేఖ ఇలాంటి దౌత్యంతో వెనక్కి తగ్గడం ఇది రెండోసారి. ఇదే వివాదంలో అక్కినేని నాగార్జున వేసిన దావా విచారణ తీవ్రరూపం దాల్చి, కోర్టు స్వయంగా నోటీసులు జారీ చేసిన తరుణంలో.. అర్థరాత్రి వేళ నాగార్జున కుటుంబానికి క్షమాపణలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి కేసును శాంతింపజేసే ప్రయత్నం చేశారు. నాగార్జున విషయంలో ఫలించిన అదే సారీ ఫార్ములా ను ఇప్పుడు కేటీఆర్ లీగల్ వార్‌లోనూ ప్రయోగించి, కేసు విచారణను నిలిపివేయడం లేదా కోర్టులోనే రాజీ కింద క్లోజ్ చేయాలనే వ్యూహాన్ని ఆమె న్యాయ బృందం అమలు చేస్తోందని భావిస్తున్నారు. గతంలో కేటీఆర్ నోటీసులు పంపినప్పుడు నేను ఎవరికీ క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు, కోర్టులోనే తేల్చుకుంటా అని సవాల్ విసిరిన సురేఖ.. ఇప్పుడు బేషరతుగా తగ్గడం బీఆర్ఎస్ శ్రేణులకు నైతిక విజయాన్ని అందించింది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్న బీఆర్ఎస్ వర్గాలు.. బాధ్యతాయుతమైన మంత్రి వ్యాఖ్యలు ఎంత నిరాధారమైనవో కొండా సురేఖ స్వయంకృత ప్రకటనతోనే నిరూపితమైందని అంటున్నాయి. కొండా సురేఖ ఆరోపణలు కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యే తప్ప అందులో ఏమాత్రం సత్యం లేదని ప్రజల ముందు సాక్ష్యంతో సహా తేలిపోయిందని బీఆర్ఎస్ మద్దతుదారులు భావిస్తున్నారు.

కేటీఆర్ కేసు ఉపసంహరించుకుంటారా?

సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి క్షమాపణ చెప్పినంత మాత్రాన కేటీఆర్ ఈ లీగల్ బ్యాటిల్‌ను విరమించుకుంటారా? లేక నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులోనే ఆమెపై చట్టపరమైన శిక్ష పడేలా కేసును ముందుకు తీసుకెళ్తారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పరువు నష్టం దావాల్లో కేవలం సోషల్ మీడియా క్షమాపణతో కోర్టులు క్రిమినల్ కేసును రద్దు చేయవు, ఫిర్యాదిదారు దానికి అంగీకరించి కేసును ఉపసంహరించుకుంటేనే చట్టపరమైన ఉపశమనం లభిస్తుంది. మరి రాజకీయంగా మంత్రిని ఇరకాటంలో పెట్టిన ఈ లీగల్ అస్త్రాన్ని కేటీఆర్ వదులుకుంటారా లేక చివరి దాకా పోరాడతారా అనేది తేలాల్సి ఉంది.