Mahaa Daily Exclusive

  సోషల్ మీడియా ద్వారా వేధిస్తున్నారు….

Share

  • సోషల్ మీడియా ద్వారా వేధిస్తున్నారు
  • కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు
  • మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలు
  • ట్రోలింగ్ లపై ఆవేదన

హైదరాబాద్, మహా : కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూరి వెంకట్ సతీమణి ఇందుజా బల్మూరి నేరుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు రాతపూర్వక ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ అనుబంధ, మద్దతుదారుల సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా తన వ్యక్తిగత జీవితంపై, ప్రీ-వెడ్డింగ్ ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ అసభ్యకర రీతిలో నెట్టింట డిజిటల్ వేధింపులకు పాల్పడుతున్నారని, ఈ సైబర్ దాడి వెనుక కేటీఆర్ ప్రోద్బలం ఉందనేది ఆమె ప్రధాన ఆరోపణ.

ఫిర్యాదు అనంతరం మీడియా వేదికగా ఇందుజా లేవనెత్తిన ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి. ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ.. వెలమ కులానికి చెందిన పురుషుడిని ప్రేమించి ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవడమే నేను చేసిన నేరమా? అంటూ ఆమె ఆవేదనతో నిలదీశారు. క్షేత్రస్థాయిలో తన భర్త బల్మూరి వెంకట్‌ను రాజకీయంగా ఢీకొట్టలేక, ఇంట్లోని మహిళలను, కుల సమీకరణాలను వేదికగా చేసుకుని కులపిచ్చితో ప్రచారాలు చేయడం బీఆర్ఎస్ నేతల దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. సాధారణంగా రాజకీయాల్లో విభేదాలు, విమర్శలు ప్రభుత్వ విధానాలు లేదా ప్రజా సమస్యలపై ఉండాలే తప్ప.. వ్యక్తిగత జీవితాలను, ఫ్యామిలీ ఫొటోలను అడ్డం పెట్టుకుని మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం ఏ రకమైన సంస్కృతి అని ఆమె ప్రశ్నించారు. నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ముసుగులో మహిళలపై జరుగుతున్న సైబర్ వేధింపులు, ఆన్‌లైన్ బుల్లీయింగ్‌పై ఇతర మహిళలకు ధైర్యం చెప్పడానికే తాను పర్సనల్‌గా ముందుకు వచ్చి సీపీని ఆశ్రయించానని స్పష్టం చేశారు. మార్ఫింగ్ పోస్టులు పెట్టిన వారిపైనే కాక, వారి వెనుక ఉండి నడిపిస్తున్న అసలు సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ ఫిర్యాదుతో హైదరాబాద్, సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తక్షణమే స్పందించి, వివాదాస్పద కంటెంట్‌ను వ్యాప్తి చేసిన డిజిటల్ ఖాతాల ఐపీ అడ్రస్‌లు, యూజర్ వివరాలను సేకరించే పనిలో పడ్డారు. కాంగ్రెస్ శ్రేణులు ఈ ఉదంతాన్ని తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవంపై దాడి గా మలిచి రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ దిష్టిబొమ్మల దహనాలకు, నిరసనలకు పిలుపునిచ్చాయి. అయితే, తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేని ఆన్‌లైన్ ట్రోలింగ్ వ్యవహారంలో రాజకీయ కోణంలోనే కేటీఆర్ పేరును కుట్రపూరితంగా లాగుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు.