- ఖేలో ఇండియా
- ఏర్పాట్లపై సీఎం రేవంత్ సమీక్ష
- శాశ్వత వసతులే లక్ష్యంగా ఏర్పాట్లు.. నాణ్యతలో రాజీ వద్దు
- అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
- 6 నగరాలు, 20 వేదికల్లో 27 క్రీడాంశాలు
హైదరాబాద్, మహా : తెలంగాణలో నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026ను అత్యున్నత ప్రమాణాలతో విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కేవలం పోటీల నిర్వహణకే పరిమితం కాకుండా.. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా శాశ్వత క్రీడా మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు. క్రీడలు ముగిసిన తర్వాత కూడా ఆయా వేదికలు నాణ్యమైన క్రీడా కేంద్రాలుగా కొనసాగాలని సూచించారు. డిసెంబర్ 11 నుంచి 22 వరకు తెలంగాణలో జరగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 8వ ఎడిషన్ ఏర్పాట్లపై మంగళవారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో సీఎం సమీక్ష నిర్వహించారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
గ్లోబల్ సమ్మిట్ వనరులూ వినియోగించుకోవాలి
ఖేలో ఇండియా పోటీల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ సన్నాహాలతో సమన్వయం చేసుకోవాలని సీఎం సూచించారు. గ్లోబల్ సమ్మిట్ కోసం సిద్ధం చేస్తున్న మౌలిక సదుపాయాలు, ఇతర వనరులను క్రీడా పోటీలకు కూడా ఉపయోగించుకునేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. క్రీడారంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ రెండు కార్యక్రమాలను ఒక మంచి అవకాశంగా మలుచుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణను దేశంలోనే ప్రముఖ క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఖేలో ఇండియా పోటీలు కీలక వేదిక కావాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న క్రీడా విధానం, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా యువతకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ, సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. భవిష్యత్తులో ఒలింపిక్స్‌లో తెలంగాణ క్రీడాకారులు పతకాలు సాధించే స్థాయికి ఎదగడమే దీర్ఘకాలిక లక్ష్యమని వివరించారు.
పర్యవేక్షణ బాధ్యతలు గ్రూప్ 1 అధికారులకు
క్రీడా వేదికల నిర్మాణం, అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. ఇందుకోసం గ్రూప్-1 స్థాయి అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. పోటీలకు ముందు ఏర్పాట్ల నుంచి చివరి పోటీ ముగిసే వరకు నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. వివిధ జిల్లాల్లో జరిగే పోటీలకు సంబంధించి స్థానికంగా పనిచేస్తున్న ట్రైనీ అధికారులు, గ్రూప్-1 అధికారులను పర్యవేక్షణ బాధ్యతల్లో భాగస్వాములను చేయాలని సూచించారు. ప్రతి వారం పనుల పురోగతిపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. గతంలో క్రీడా కార్యక్రమాల కోసం నిర్మించిన కొన్ని మౌలిక సదుపాయాలు కొన్నేళ్లకే దెబ్బతిన్న విషయాన్ని సీఎం ప్రస్తావించారు. అలాంటి పరిస్థితులు మళ్లీ తలెత్తకుండా నిర్మాణాల నాణ్యత, నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.
క్రీడాకారులకు మెరుగైన వసతి, ఆహారం
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది యువ క్రీడాకారులు తెలంగాణకు రానున్న నేపథ్యంలో వారి అవసరాలకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. ముఖ్యంగా వసతి, భోజనం విషయంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వాతావరణానికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రారంభ, ముగింపు వేడుకల్లో అవసరానికి మించిన ఆడంబరాలకు దూరంగా ఉండాలని, అందుబాటులో ఉన్న వనరులను క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యంగా వినియోగించాలని పేర్కొన్నారు.
6 నగరాల్లో 20 వేదికలు.. 27 క్రీడాంశాలు
డిసెంబర్ 11 నుంచి 22 వరకు జరిగే ఈ పోటీలకు దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో క్రీడాకారులు తరలిరానున్నారు. ఏడు వేల మందికి పైగా యువ క్రీడాకారులతో పాటు సుమారు రెండు వేల మంది కోచ్‌లు, సహాయక సిబ్బంది, అధికారులు తెలంగాణకు చేరుకోనున్నారు. హైదరాబాద్‌తో పాటు మరో ఐదు నగరాల్లో మొత్తం 20 వేదికలపై 27 రకాల క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. వీటితో పాటు ఒక డెమో క్రీడను కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ సంప్రదాయ క్రీడ అయిన కర్రసామును కూడా ఆతిథ్య రాష్ట్రం తరఫున పోటీల్లో చేర్చే అవకాశాలను పరిశీలించి, వెంటనే కార్యాచరణ చేపట్టాలని సీఎం సూచించారు.
తెలంగాణ క్రీడాకారులపై ప్రత్యేక దృష్టి
సొంత రాష్ట్రంలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక పోటీల్లో తెలంగాణ క్రీడాకారులు మెరుగైన ప్రదర్శన కనబరిచేలా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. ఇప్పటికే వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఖేలో ఇండియా శిబిరాల్లో క్రీడాకారులు సాధన చేస్తున్నారు. పోటీల కోసం ఎంపిక చేసిన 20 వేదికల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, వాటి పురోగతిని సమావేశంలో వివరించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం సలహాదారు కె. రామకృష్ణారావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (స్పోర్ట్స్) వాణీ ప్రసాద్, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనిబాలా దేవి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.







