వణికిస్తున్న ‘మురసు’ తీవ్ర తుఫాన్.
* ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
* పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు. *సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ సూచన
అమరావతి, మహా.
ఆంధ్రప్రదేశ్‌ను మురసు తీవ్ర తుఫాన్ తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న కొన్ని గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ముఖ్యంగా పోలవరం, కాకినాడ, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, పల్నాడు జిల్లాలతో పాటు దక్షిణ కోస్తాంధ్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. అలాగే మన్యం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, నెల్లూరు, వైఎస్ఆర్ కడప, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని వివరించారు.
దక్షిణ కోస్తాంధ్రపై మురసు తీవ్ర తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉందని, ఇది క్రమంగా బలహీనపడి వాయుగుండంగా మారుతుందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరూ కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, పూర్తిగా సురక్షితమైన ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించారు. ప్రయాణ సమయాల్లో పొంగుతున్న వాగులు, కాలువలను దాటే సాహసం చేయవద్దని స్పష్టం చేశారు. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదం ఉన్నందున, ఆయా ప్రాంతాల ప్రజలు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మంగళవారం రాత్రి నుంచి ఈదురుగాలుల తీవ్రత క్రమంగా తగ్గే అవకాశం ఉందని, అయినప్పటికీ మత్స్యకారులు, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ విజ్ఞప్తి చేసింది.







