తొమ్మిదిన్నరేళ్లు రాష్ట్రాన్ని కొల్లగొట్టి ప్రజలను పేదలుగా మార్చారు.
* కేసీఆర్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం.
ఖమ్మం, మహా.
తెలంగాణలోని ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో తొమ్మిదిన్నరేళ్ల పాటు రాష్ట్రాన్ని ఏలిన ఆ దొరలు పేదోళ్ల కష్టాలను ఏమాత్రం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. కేవలం వారి స్వార్థానికి, స్వలాభానికి రాష్ట్ర సొత్తును పూర్తిగా కొల్లగొట్టి ప్రజలను మరింత పేదవాళ్లుగా చేశారని ఆయన మండిపడ్డారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తెల్దారుపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రతిపక్షాల నేతలు అసత్య ఆరోపణలు చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారని మంత్రి పొంగులేటి దుయ్యబట్టారు. గతంలో కేసీఆర్ హయాంలో రైతులు వరి సాగు చేస్తే ఉరే అన్నారని, కానీ తమ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అన్నదాతలు పండించిన ప్రతి గింజకూ బోనస్ ఇచ్చి ఆదుకుంటోందని తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వం ప్రతి పేదింటికి సంక్షేమ ఫలాలను నేరుగా అందజేస్తోందని వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగులకు అండగా నిలుస్తున్నామని, ఇప్పటికే రాష్ట్రంలో 74 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, త్వరలోనే మరిన్ని ఉద్యోగాలను కూడా కల్పిస్తామని ఆయన యువతకు భరోసా కల్పించారు.
రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇప్పటికే 8 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇళ్లను అందించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. సుమారు 120 సంవత్సరాల క్రితం నాటి పాత పద్ధతులకు స్వస్తి పలికి, రాష్ట్రంలో ప్రతి అంగుళం భూమిని సర్వే చేసి భూయజమానులకు పూర్తి భరోసా కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే పాలేరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సమగ్ర భూసర్వే చేపట్టాలని కలెక్టర్‌ను ఇప్పటికే ఆదేశించినట్లు వెల్లడించారు. సరికొత్త మ్యాపులతో కూడిన ఈ సర్వే ద్వారా మనిషికి ఆధార్ కార్డు ఎలా ఉంటుందో, అదేరీతిలో ప్రతి భూమికి ‘భూదార్’ నంబర్ కేటాయించి యజమానులకు అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు. విద్య, వైద్య రంగాలపై తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.







