Mahaa Daily Exclusive

  ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో తీవ్ర కరువు….

Share

ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో తీవ్ర కరువు.
* రైతులను ఆదుకోవడానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి.
* ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్

కొత్తగూడెం, మహా.
ఎల్‌నినో ప్రభావం కారణంగా జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోయారని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు అందక రాష్ట్రంలో పంట పొలాలు పూర్తిగా ఎండిపోయి బీడు భూములుగా మారాయని ఆయన తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలని, కరువు ప్రభావిత ప్రాంతాలకు తక్షణమే ప్రత్యేక ప్యాకేజీని కేటాయించి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎండిపోయిన ప్రతి ఎకరం పంటకు, బీడు భూములకు ప్రభుత్వం తగిన పంట నష్టపరిహారాన్ని అందించాలని కోరారు.
ముఖ్యంగా వరి పంట నష్టపోయిన రైతన్నలకు ఎకరాకు రూ.30 వేలు, అలాగే పత్తి, మిర్చి తదితర వాణిజ్య పంటలకు ఎకరాకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. కేవలం రైతులకే కాకుండా, ఉపాడి కోల్పోయిన వ్యవసాయ కూలీలకు ప్రతి కుటుంబానికి రూ.10 వేల చొప్పున కరువు భత్యం అందించాలని సూచించారు. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు రేషన్ బియ్యంతో పాటు మరో 16 రకాల నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కానీ దురదృష్టవశాత్తు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రమైన కరువు సమస్యపై దృష్టి సారించకుండా కేవలం ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాయని కూనంనేని విమర్శించారు. అన్నదాతలు తమ కష్టార్జితమైన పంటలను కోల్పోయి రోడ్డున పడి తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, ప్రభుత్వాలు మాత్రం కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కావడం తగదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా రూ.25 వేల కోట్ల కరువు సహాయ నిధిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన హితవు పలికారు. ఈ పర్యటనలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు భాగం హేమంతరావు, జిల్లా నాయకులు దొండపాటి రమేష్, ఎర్రబాబు తదితరులు పాల్గొన్నారు.