ఏపీలో మురసు తుఫాన్ బీభత్సం.
* 15 జిల్లాల్లో 30,661 హెక్టార్లలో దెబ్బతిన్న పంటలు.
* పునరావాస కేంద్రాలకు 10,805 మంది గుర్తింపు.
* రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు
అమరావతి, మహా.
ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేసిన ‘మురసు’ తీవ్ర తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లింది. తుఫాన్ కారణంగా రాష్ట్రంలోని 15 జిల్లాల్లో సుమారు 30,661 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ముఖ్యంగా కృష్ణా, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో అత్యధికంగా పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు భారీ నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 15 జిల్లాల్లోని 132 మండలాల్లో సాధారణ స్థాయికంటే మించి మురసు తుఫాన్ తన ప్రభావం చూపినట్లు అంచనాకు వచ్చారు.
తుఫాన్ తీరం దాటే సమయంలో మార్కాపురం జిల్లా డోర్నాల వద్ద గంటకు ఏకంగా 107 కిలోమీటర్ల భారీ వేగంతో ఈదురుగాలులు వీచాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల నుంచి అప్రమత్తమైన అధికారులు సుమారు 10,805 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం కల్పించారు. మొత్తం 171 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు బాధితుల కోసం 14,810 ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. సహాయక చర్యల కోసం 11 ఎన్డీఆర్ఎఫ్, 13 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. విద్యుత్ అంతరాయం తలెత్తకుండా 613 జనరేటర్లను సిద్ధం చేశారు. తుఫాన్ సమయంలో కూలిన చెట్లను, నిలిచిపోయిన నీటిని తక్షణమే తొలగించడానికి అగ్నిమాపకదళ బృందాలతో పాటు చెట్లను తొలగించేందుకు 185 ప్రత్యేక బృందాలను అందుబాటులో ఉంచారు.
మునుపెన్నడూ లేని విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలతో ప్రభుత్వం ప్రాణనష్టాన్ని నివారించింది. తుఫాన్ వచ్చే ముందే రాష్ట్రవ్యాప్తంగా 3,066 మంది గర్భిణులను, 1,008 మంది బాలింతలను సురక్షితమైన ఆసుపత్రులకు తరలించారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 13 జిల్లాల్లో 725 వైద్య బృందాలను మోహరించగా, అత్యవసర వైద్య సేవల కోసం 362 అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేందుకు ఏకంగా 3.77 కోట్ల మంది మొబైల్ ఫోన్లకు తుఫాన్ హెచ్చరికల సందేశాలను నిరంతరం జారీ చేశారు. అంతేకాకుండా, తుఫాన్ అత్యవసర సహాయం కోసం ‘మనమిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ సేవల సదుపాయాన్ని ఆర్టీజీఎస్ (RTGS) ప్రత్యేకంగా కల్పించి క్షణక్షణం పరిస్థితులను పర్యవేక్షించింది.







