హైదరాబాద్, మహా.
రంగారెడ్డి జిల్లాలో పోలీసులు భారీ నకిలీ కరెన్సీ రాకెట్‌ను విజయవంతంగా భగ్నం చేశారు. అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో లభించిన ఆధారాలతో కూపీ లాగిన పోలీసులకు, హయత్‌నగర్ పరిధిలోని కుంట్లూరులో నకిలీ నోట్లు ముద్రిస్తున్న కేంద్రం గురించి కీలక సమాచారం లభించింది. ఆ ఇంటిపై పోలీసులు ఆకస్మికంగా దాడి చేసి, పంపిణీకి పూర్తిగా సిద్ధం చేసిన రూ.6.7 కోట్ల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసు వివరాలను ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ ఘరానా మోసానికి పాల్పడిన నలుగురు నిందితులను అరెస్టు చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు. నిందితుల నుంచి మొత్తం రూ.6.78 కోట్ల విలువైన నకిలీ రూ.500 నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు.
నవంబర్ ఒకటో తేదీ రాత్రి అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ సమీపంలోని బాలాజీ దాబా వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. విజయవాడకు నకిలీ నోట్లు తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో అటుగా వచ్చిన మారుతి డిజైర్ కారును అడ్డగించి తనిఖీ చేయగా, వారి వద్ద 1,600 నకిలీ రూ.500 నోట్లు బయటపడ్డాయి. కేవలం నకిలీ నోట్లే కాకుండా, నకిలీ పోలీస్ ఐడీ కార్డులు, డమ్మీ పిస్టల్, రెండు వాకీటాకీలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను తమదైన శైలిలో విచారించగా, కుంట్లూరులో ఓ అద్దె ఇల్లు తీసుకుని నకిలీ కరెన్సీ తయారీ కేంద్రం నడుపుతున్నట్లు అంగీకరించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి మరో రూ.6.7 కోట్ల నకిలీ నోట్లను సీజ్ చేశారు.
ఈ సందర్భంగా సీపీ తరుణ్ జోషి మాట్లాడుతూ, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో నకిలీ నోట్లను ముద్రిస్తూ చలామణి చేస్తున్నారనే సమాచారంతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి ఈ ముఠా ఆటకట్టించామని తెలిపారు.
అసలు ఈ ముఠా నోట్లను ఎలా ముద్రించిందనే కోణంలో దర్యాప్తు చేయగా విస్మయకర విషయాలు వెలుగుచూశాయి. ఒరిజినల్ రూ.500 నోట్లను స్కాన్ చేసి, ఫోటోషాప్ ద్వారా ఎడిట్ చేసి కలర్ ప్రింటర్ల సహాయంతో ఈ నకిలీ నోట్లను ముద్రించినట్లు విచారణలో తేలింది. యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా వీడియోల ద్వారానే వీరు నకిలీ నోట్ల తయారీ విధానాన్ని పూర్తిగా నేర్చుకున్నట్లు వెల్లడైంది. ఈ దందా కోసం వీరు కలర్ ప్రింటర్లు, లేజర్ ప్రింటర్లు, ల్యాప్‌టాప్, స్కానర్, లామినేషన్ మిషన్‌తో పాటు కరెన్సీ కటింగ్ మిషీన్‌ను కూడా యథేచ్ఛగా వినియోగించినట్లు గుర్తించారు. కేవలం నకిలీ నోట్ల ముద్రణే కాకుండా, కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుని తాము పోలీసులమంటూ బెదిరింపులకు పాల్పడుతూ భారీగా వసూళ్లకు పాల్పడినట్లు కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. పరారీలో ఉన్న మిగతా ముగ్గురు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.







