Mahaa Daily Exclusive

  బలవంతపు పదవీ విరమణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.

Share

 

  • ఊహాగానాలతో నిర్ణయాలు తగదని స్పష్టీకరణ.
  • ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, మహా.

ప్రభుత్వ ఉద్యోగులకు బలవంతపు పదవీ విరమణ (కంపల్సరీ రిటైర్‌మెంట్) విధించే విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది. ఉద్యోగులను ఇంటికి పంపే అధికారం ప్రభుత్వాలకు ఉన్నప్పటికీ, అది కేవలం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, ఉద్యోగి సమగ్ర సర్వీస్ రికార్డును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే జరగాలని స్పష్టం చేసింది. అధికారుల వ్యక్తిగత అభిప్రాయాలు లేదా ఊహాగానాల ఆధారంగా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. జస్టిస్ మన్మోహన్, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది.

వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం 2017లో 50 ఏళ్ల వయసు లేదా 20 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగుల పనితీరును సమీక్షించి, ఐదుగురికి బలవంతపు పదవీ విరమణ విధించింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లను కొట్టివేస్తూ ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా సమర్థించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణకు సంబంధించి ధర్మాసనం పలు కీలక అంశాలను వెల్లడించింది. బలవంతపు పదవీ విరమణ అనేది ఏమాత్రం శిక్షాత్మక చర్య కాదని కోర్టు స్పష్టం చేసింది. దానర్థం ఆ ఉద్యోగి దుష్ప్రవర్తనకు లేదా అవినీతికి పాల్పడ్డారని కాదని వివరించింది. పరిపాలనా అవసరాల రీత్యా, ఆ ఉద్యోగి సేవలను కొనసాగించడం ప్రజా ప్రయోజనాలకు అనుకూలమా కాదా అన్నది సమర్థ అధికారి నిర్ణయించవచ్చని తెలిపింది.

అయితే, ఒక ఉద్యోగిని సేవలకు పనికిరాని వ్యక్తిగా నిర్ధారించడానికి కేవలం పైఅధికారుల అభిప్రాయం మాత్రమే సరిపోదని, అందుకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు రికార్డుల్లో తప్పనిసరిగా ఉండాలని కోర్టు నొక్కిచెప్పింది. నిర్ణయం తీసుకునే ముందు సదరు ఉద్యోగుల పనితీరు, నిజాయితీ, సామర్థ్యంతో పాటు వార్షిక రహస్య నివేదికలను (ఏసీఆర్) పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా వారి పనితీరులో నిరంతర క్షీణత ఉందా లేదా అనే అంశాన్ని ప్రధానంగా పరిశీలించాలని పేర్కొంది.

తమతో సమానమైన రికార్డు ఉన్న ఇతర ఉద్యోగులను కొనసాగిస్తూ తమను మాత్రమే తొలగించడం వివక్షేనంటూ పిటిషనర్లు చేసిన వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రతి ఉద్యోగి పనితీరును వ్యక్తిగతంగానే మదింపు చేయాలని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని సమానత్వ సూత్రం ‘నెగెటివ్ ఈక్వాలిటీ’కి (గతంలో ఒకరికి జరిగిన తప్పును లేదా నిబంధనల ఉల్లంఘనను ఆధారం చేసుకుని, అదే ప్రయోజనాన్ని కోరడం) ఏమాత్రం వర్తించదని తేల్చిచెప్పింది. అలాగే, ఈ తరహా పరిపాలనా నిర్ణయాల్లో న్యాయస్థానాల జోక్యానికి పరిమితులు ఉంటాయని ధర్మాసనం గుర్తుచేసింది. నిర్ణయం తీసుకునే ముందు సరైన ఆధారాలు ఉన్నాయా, అధికారుల చర్యల్లో ఏదైనా దురుద్దేశం లేదా పక్షపాతం ఉందా అని మాత్రమే కోర్టులు పరిశీలిస్తాయని స్పష్టం చేసింది. కేవలం ప్రభుత్వ నిర్ణయంతో ఏకీభవించనంత మాత్రాన ఆ ఉత్తర్వులను కోర్టులు రద్దు చేయలేవని సుప్రీం తన తీర్పులో కుండబద్దలు కొట్టింది.