Mahaa Daily Exclusive

  వాళ్లను మేడిగడ్డ వద్దే పాతిపెట్టడమే సరైన శిక్ష.

Share

  • కాళేశ్వరం కట్టింది మీరే.. కూలితే బాధ్యత ఎవరిది
  • పదేళ్లలో 20 లక్షల కోట్ల బడ్జెట్ ఏమైంది?
  • పాలమూరుకు కేసీఆర్ చేసింది శూన్యం.
  • బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.

కొడంగల్,మహా.

కాళేశ్వరం ప్రాజెక్టును అత్యద్భుతంగా తామే కట్టామని గొప్పలు చెప్పుకున్న బీఆర్ఎస్ నేతలు, ఇప్పుడు ఆ ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుప్పకూలిపోతే మాత్రం కనీస బాధ్యత వహించకుండా తప్పించుకు తిరుగుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అలాంటి నాయకులను తీసుకెళ్లి మేడిగడ్డ వద్దే పాతిపెట్టడమే వారికి విధించే సరైన శిక్ష అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని హకీంపేటలో శనివారం ఏర్పాటు చేసిన అగ్రి, ఇండస్ట్రియల్ ఎక్స్‌పో (రైతుమేళా)ను సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆసక్తిగా తిలకించిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు లక్ష్యంగా నిప్పులు చెరిగారు.

తెలంగాణ రాష్ట్రానికి వరప్రదాయినిగా మారాల్సిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును గత కేసీఆర్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పక్కనపెట్టిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆ ప్రాజెక్టు పేరు మార్చి, స్థలం మార్చి, అంచనా వ్యయాలను భారీగా పెంచేసి కాళేశ్వరం ప్రాజెక్టును తెరపైకి తెచ్చారని విమర్శించారు. కాళేశ్వరాన్ని దగ్గరుండి తానే కట్టించానని గతంలో హరీశ్ రావు ఎంతో గొప్పగా డబ్బాలు కొట్టుకున్నారని, అప్పటి గవర్నర్‌తో తన పేరు హరీశ్ రావు కాదని ‘కాళేశ్వరరావు’ అని భజన చేయించుకున్నారని సీఎం ఎద్దేవా చేశారు. తమ హయాంలోనే కట్టిన ఆ ప్రాజెక్టు పేకమేడలా కుప్పకూలిపోతే ఇప్పుడు సమాధానం చెప్పే నాథుడే కరువయ్యాడని మండిపడ్డారు. మేడిగడ్డతో సంబంధం లేకుండానే నీళ్లు ఎత్తిపోస్తామని ఇప్పుడు చెబుతున్న గులాబీ నేతలు.. అసలు ఆ బ్యారేజీని ఎందుకు కట్టినట్లో సమాధానం చెప్పాలని నిలదీశారు. మేడిగడ్డ బ్యారేజీలో కనీస నీటి నిల్వ లేకపోతే కన్నెపల్లి పంపులు ఎలా పనిచేస్తాయని, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల్లోనూ నీళ్లు నిల్వ చేయలేని దుస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిపెట్టలేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే కాళేశ్వరంపై బీఆర్ఎస్ నేతలు పచ్చి అబద్ధాలు ఆడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు.

గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రానికి ఏకంగా 20 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ చేతికి వచ్చినా, అందులోంచి పాలమూరు జిల్లాకు కేసీఆర్ చేసిందేమీ లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. పదేళ్ల పాటు పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు వాతావరణ మార్పుల వల్ల ఏర్పడే ‘ఎల్‌నినో’ ప్రభావం పైనా బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్‌నినో వల్ల ప్రపంచవ్యాప్తంగా కరువు వస్తే, అది కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల వచ్చినట్లుగా ప్రతిపక్ష నేతలు వితండవాదం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.