- మరో వారం రోజుల్లో 13 డిగ్రీలకు పడిపోనున్న ఉష్ణోగ్రతలు!
హైదరాబాద్, మహా : తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాత్రి వేళల్లో చలి ప్రభావం అధికమవుతోంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం రాత్రిపూట సగటు ఉష్ణోగ్రతలు 16.9 నుంచి 22 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయి. మరో వారం రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 13 డిగ్రీల వరకు పడిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో రాత్రి, తెల్లవారుజామున చలి తీవ్రత మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలి!
చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆస్తమా, ఇతర శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. రాత్రి వేళల్లో బయటకు వెళ్లేటప్పుడు వెచ్చని దుస్తులు ధరించాలని, చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచిస్తున్నారు. రానున్న వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉండటంతో హైదరాబాద్ వాసులు చలి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.








