- ఎన్ జీటీ సుమోటో విచారణ
- 300 మీటర్ల దూరంలోనే బొగ్గు తవ్వకాలకు ప్రతిపాదన
ములుగు, మహా : రాష్ట్రంలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడం రామప్ప ఆలయం సమీపంలో ప్రతిపాదిత బొగ్గు గని ప్రాజెక్టుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్ జీటీ) సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ పరిణామం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సింగరేణి కాలరీస్ సంస్థ చేపట్టనున్నట్లు ప్రతిపాదించిన బొగ్గు గని ప్రాజెక్టుతో చారిత్రక రామప్ప ఆలయం, సమీపంలోని రామప్ప చెరువుకు పర్యావరణపరమైన ముప్పు ఏర్పడే అవకాశం ఉందని పర్యావరణ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆలయానికి సుమారు 300 మీటర్ల దూరంలో బొగ్గు తవ్వకాలు చేపడితే భూకంపనాలు, భారీ యంత్రాల వినియోగం, భూగర్భ జలాలపై ప్రభావం వంటి అంశాలు ఆలయ నిర్మాణ భద్రతకు సమస్యగా మారవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న ఎన్ జీటీ సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ ప్రభావాలు, చారిత్రక కట్టడం పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై వివరాలు కోరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన రామప్ప ఆలయం తెలంగాణకే గర్వకారణంగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టినా వారసత్వ సంపద, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. రామప్ప వారసత్వ సంపదను కాపాడటం, అభివృద్ధి ప్రాజెక్టుల పర్యావరణ ప్రభావాలను సమీక్షించడం ఇప్పుడు కీలకంగా మారింది. ఎన్ జీటీ విచారణలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని ఆసక్తిగా మారింది.








