Mahaa Daily Exclusive

  కేటీఆర్ గడ్డంపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు

Share

  • ‘ఎన్ని జన్మలెత్తినా నువ్వు రేవంత్ రెడ్డివి కాలేవు’
  • ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో నీటి లభ్యత తగ్గుతుందన్న సీఎం
  • ప్రాజెక్టులలో ఉన్న నీరు తాగేందుకు మాత్రమే
  • రైతులు ఆరు తడి పంటలు సాగు చేయాలని సూచన
  • రాబోయే మునిసిపల్, సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బుద్ది చెప్పాలని పిలుపు
  • కొడంగల్ సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి

 

కొడంగల్, మహా : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేటీఆర్ తన వేషభాషలు మార్చుకున్నంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్నారు. తనను చూసి కేటీఆర్ గడ్డం పెంచుకుంటున్నారని.. అలా చేసినంత మాత్రాన రేవంత్ రెడ్డి కాలేరని వ్యాఖ్యానించారు. ఎన్ని జన్మలెత్తినా నువ్వు రేవంత్ రెడ్డివి కాలేవు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మూడు రోజుల కొడంగల్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా శనివారం నిర్వహించిన సభల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పాలన, సాగునీటి ప్రాజెక్టులు, ఎల్‌నినో ప్రభావం, కొడంగల్ అభివృద్ధి వంటి అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

 

కేటీఆర్ వ్యవహారశైలిపై స్పందిస్తూ రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నంత మాత్రాన పులి కాలేదని చురకలంటించారు. తనకు గడ్డం ఉంది కాబట్టి కేటీఆర్ కూడా గడ్డం పెంచుకుంటే సరిపోదని అన్నారు. తనకు గడ్డం రావడానికే 50 ఏళ్లు పట్టిందని.. ఇక కేటీఆర్‌కు బుద్ధి రావడానికి ఇంకెన్నాళ్లు పడుతుందో అంటూ ఎద్దేవా చేశారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 3 ఏళ్లుగా ఒక్క గంట కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నానని పేర్కొన్నారు.

 

రాబోయే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తమ తీర్పు ద్వారా బీఆర్ఎస్‌కు తగిన సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. అయితే ఇవన్నీ రాజకీయ విమర్శలేనని.. ఎన్నికల్లో ప్రజల తీర్పే కీలకమని ఆయన వ్యాఖ్యల సారాంశం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలమూరు ప్రాంతానికి తగిన న్యాయం జరగలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పాలమూరు ప్రజలు కేసీఆర్‌ను ఎంపీగా గెలిపించినప్పటికీ.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ప్రాంత సాగునీటి ప్రాజెక్టులపై ఆశించిన స్థాయిలో దృష్టి పెట్టలేదని విమర్శించారు. 10 ఏళ్ల పాలనలో రూ.20 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు చేసినప్పటికీ కీలక ప్రాజెక్టులు పూర్తి కాలేదని అన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పక్కనపెట్టి కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. సుమారు రూ.38 వేల కోట్లతో పూర్తయ్యే అవకాశం ఉన్న ప్రాజెక్టును పక్కనపెట్టి.. కాళేశ్వరం అంచనా వ్యయాన్ని భారీగా పెంచారని ఆరోపించారు. సుమారు రూ.1.5 లక్షల కోట్ల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో 3 ఏళ్లకే సమస్యలు తలెత్తాయని వ్యాఖ్యానించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం వెనుక ఉన్న కారణాలు, నాణ్యతా లోపాలు, అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు.

 

ఎల్‌నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షపాతం తగ్గే పరిస్థితులు ఉన్నాయని.. తెలంగాణలోనూ జలాశయాల్లో నీటిమట్టాలు పడిపోయాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటిని ప్రధానంగా తాగునీటి అవసరాలకే వినియోగించాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. రాబోయే రోజుల్లో ఎండలు మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని.. రైతులు ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు. ఎల్‌నినోపై బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ అంశంపై చర్చించేందుకు బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీకి రావాలని ముఖ్యమంత్రి సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టు, భూముల వ్యవహారాలపైనా సభలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. డిసెంబర్‌లో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు స్పీకర్ అనుమతి కోరుతున్నామని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీలో 16 టీఎంసీల నీరు ఉంటేనే కన్నెపల్లి పంపుల ద్వారా నీటిని ఎత్తిపోయడం సాధ్యమవుతుందని రేవంత్ రెడ్డి వివరించారు. బ్యారేజీ దెబ్బతినడంతో పంపుల నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గేట్ల నిర్వహణ విషయంలోనూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

 

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ కోరామని.. ఆ విచారణ జరగకుండా అడ్డుకున్నదెవరో బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మరోవైపు ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టు పూర్తయితే గ్రావిటీ ద్వారా నల్గొండ ప్రాంతానికి నీరు అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా కూడా సాగునీరు అందించవచ్చన్నారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా ఇప్పటికే రైతులకు నీరు అందుతోందని, తుపాకులగూడెంకు కూడా అక్కడి నుంచే నీటిని తరలిస్తున్నామని వివరించారు. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధిని కొందరు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మక్తల్-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు వేగంగా సాగుతున్నాయని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే పాలమూరు ప్రాంత రైతులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. కొడంగల్‌కు రావాల్సిన పరిశ్రమలను గతంలో సిరిసిల్లకు తరలించారని బీఆర్ఎస్‌పై ఆరోపణలు చేశారు. భూసేకరణలో భూములు కోల్పోతున్న రైతులకు తమ ప్రభుత్వం ఎకరాకు రూ.20 లక్షల వరకు పరిహారం అందిస్తోందని తెలిపారు.

 

గతంలో ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ.2 లక్షలు ఇవ్వడానికి కూడా కేసీఆర్ ప్రభుత్వం ముందుకు రాలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. హకీంపేటలో 250 ఎకరాల్లో ఎడ్యుకేషన్ హబ్ నిర్మిస్తున్నామని, హైదరాబాద్‌-లగచర్ల ప్రాంతాన్ని ఢిల్లీ-నోయిడా తరహాలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. ప్రజలకు కష్టాలు ఎదురైనప్పుడు ప్రభుత్వం అండగా ఉండాల్సిన బాధ్యత తనపై ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు, ప్రజలు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. సంక్రాంతి తర్వాత తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని ప్రకటించారు. కొడంగల్ పర్యటనలో భాగంగా హకీంపేట, దుద్యాల మండలాల్లో రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పోను ప్రారంభించారు. పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. హకీంపేటలో నిర్మిస్తున్న ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించారు. రాష్ట్రంలో సాగునీటి లభ్యత, రైతుల అవసరాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పారు.