Mahaa Daily Exclusive

  వరంగల్ తూర్పు కాంగ్రెస్ లో మళ్ళీ వర్గపోరు

Share

  • వరంగల్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల్లో కలవరం
  • సీఎం ఫ్లెక్సీలో కనిపించని స్థానిక ఎమ్మెల్యే కొండా సురేఖ ఫోటో
  • వరంగల్ డిసీసీ అధ్యక్షుడు ఎండి అయూబ్ పై విమర్శలు

వరంగల్, మహా;

వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ లో వర్గపోరు మరోసారి బయటపడింది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా వరంగల్ పోచమ్మ మైదాన్ జంక్షన్ లో వరంగల్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ ఏర్పాటు చేసిన భారీ బ్యానర్ లో స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొండా సురేఖ ఫోటో లేకపోవడం తీవ్ర చర్చకు దారితీసింది. కావాలనే ఆమె ఫోటోను పక్కన పెట్టారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో పాటు దాదాపు 10 మంది నేతల ఫోటోలు ఉన్నాయి.

కానీ వరంగల్ తూర్పు నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ ఫోటో మాత్రం లేదు. ఇదే బ్యానర్ లో ఇతర నియోజకవర్గాల నేతలు, మాజీ కార్పొరేటర్ల ఫోటోలు ఉన్నా, సొంత నియోజకవర్గ ఎమ్మెల్యే ఫోటో లేకపోవడం కాంగ్రెస్ శ్రేణుల్లోనే హాట్ టాపిక్ అయ్యింది.

అయూబ్ వర్సెస్ కొండా సురేఖ – పాత వైరమా?

వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం.డి. అయూబ్ కు, ఎమ్మెల్యే కొండా సురేఖ కు మధ్య గత కొంతకాలంగా విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.

పార్టీ కార్యక్రమాల్లో, నియామకాల్లో, కార్పొరేషన్ పదవుల్లో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని స్థానిక కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు.

ఈ బ్యానర్ ఎపిసోడ్ తో ఆ వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. సీఎం జన్మదినం లాంటి ముఖ్యమైన సందర్భంలో కూడా ప్రోటోకాల్ పాటించకుండా స్థానిక ఎమ్మెల్యేను విస్మరించడం పార్టీలో చీలికకు నిదర్శనమని కార్యకర్తలు మండి పడుతున్నారు.

కార్యకర్తల్లో చర్చ – ప్రోటోకాల్ ఏమైంది?

జిల్లా అధ్యక్షుడు అయినా, ఏదైనా బ్యానర్ వేసేటప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఫోటో వేయడం కనీస మర్యాద, ప్రోటోకాల్. అది కూడా మాజీ మంత్రి, సీనియర్ నాయకురాలు కొండా సురేఖను మర్చిపోవడం కావాలనే చేసినట్లు ఉంది” అని ఓ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వ్యాఖ్యానించారు.

అయూబ్ తన వర్గాన్ని మాత్రమే చూసుకుంటున్నారు, కొండా సురేఖ వర్గాన్ని పక్కన పెడుతున్నారు అనే టాక్ వరంగల్ తూర్పులో జోరుగా సాగుతోంది.

ఈ విషయం అధిష్టానం దృష్టికి వెళితే, పార్టీకి నష్టం జరుగుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇతర పార్టీల నేతల సెటైర్లు

కాంగ్రెస్ లో అంతర్గత పోరును చూసి ప్రతిపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి. సొంత ఎమ్మెల్యేను కూడా కలుపుకోలేని జిల్లా అధ్యక్షుడు జిల్లాను ఎలా నడిపిస్తాడు?” అని బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఐక్యతను చాటాల్సిన చోట, వరంగల్ తూర్పులో వర్గపోరు మరోసారి బయటపడింది. జిల్లా అధ్యక్షుడు ఎం.డి. అయూబ్ ఉద్దేశపూర్వకంగానే కొండా సురేఖ ఫోటోను పెట్టలేదా? లేక పొరపాటున మర్చిపోయారా? దీని పై కొండా సురేఖ వర్గం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే!