- 416 గ్రామాల్లో భూ రీసర్వే పూర్తి
- ఒక్క చిన్న తప్పు జరిగినా సహించం
- జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో మంత్రి పొంగులేటివీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్, మహా : భూ రీసర్వే ప్రక్రియలో దొర్లే చిన్న పొరపాటు కూడా భవిష్యత్తులో తీవ్రమైన భూ వివాదాలకు దారితీయకూడదని, ప్రతి భూ యజమానికి స్పష్టమైన హక్కులు, కచ్చితమైన హద్దులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయం నుంచి భూ రీసర్వే పురోగతిపై అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో మంత్రి ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో సర్వే పురోగతి, రైతులకు ఎదురవుతున్న సమస్యలపై ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు. తరతరాలుగా నలుగుతున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడానికే ప్రభుత్వం ఈ సమగ్ర భూ సర్వేను ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని పొంగులేటి పేర్కొన్నారు. అధికారులు ఎక్కడా నిర్లక్ష్యానికి తావివ్వకుండా పారదర్శకత, కచ్చితత్వంతో బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు.
‘ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెవెన్యూ రికార్డులను ప్రామాణికంగా తీసుకునే భూ సర్వేను ప్రారంభించాలి. సర్వే పూర్తయిన తర్వాత ప్రతి భూ యజమానికి తప్పనిసరిగా నోటీసులు జారీ చేయాలి.’ అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. సర్వే పూర్తయిన గ్రామాల్లో భూ యజమానులకు కేటాయించే ప్రత్యేక భూదార్ నంబర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నారు. నోటీసులు అందుకున్న రైతులకు తమ భూ హద్దులు, వైశాల్యంపై ఏవైనా అభ్యంతరాలు లేదా సూచనలు ఉంటే వాటిని తెలియజేసేందుకు తగిన అవకాశం కల్పించాలన్నారు. సర్వే విధానం, హద్దుల గుర్తింపు, ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియపై గ్రామ స్థాయిలో రైతులకు స్పష్టమైన అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు పొంగులేటి. తెలంగాణ ప్రాంతంలో దాదాపు 125 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రభుత్వం సమగ్ర భూ రీసర్వేకు శ్రీకారం చుట్టిందన్నారు. అధునాతన డ్రోన్ సాంకేతికత, రోవర్లు మరియు జియో-కోఆర్డినేట్ల (జియో -ఆధారంగా భూముల కొలతలు నిర్వహిస్తున్నామన్నారు. తొలి దశలో 2,720 గ్రామాల్లో ప్రభుత్వం భూ సర్వే చేపట్టింది. 416 గ్రామాల్లో సర్వే పూర్తయింది. 1000కి పైగా గ్రామాల్లో సర్వే మెుదలైంది. రెవెన్యూ రికార్డుల ఆధరంగా భూ సర్వే ప్రారంభించాలని ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. సర్వే పూర్తయిన భూ యజమానులకు తప్పనిసరిగా నోటీసులు ఇవ్వాలన్నారు.








