Mahaa Daily Exclusive

  అటవీ అధికారి ఇంట్లో ‘అక్రమ’ సామ్రాజ్యం!

Share

అటవీ అధికారి ఇంట్లో ‘అక్రమ’ సామ్రాజ్యం!
• రూ.7.60 కోట్ల అక్రమాస్తులు.
• లోకాయుక్త మెరుపు దాడుల్లో బట్టబయలు
భోపాల్,మహా.

అటవీ సంపదను కాపాడాల్సిన ఓ ఉన్నతాధికారి, తన పదవిని అడ్డుపెట్టుకుని అక్రమాస్తుల సామ్రాజ్యాన్నే నిర్మించుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని సత్పురా టైగర్ రిజర్వ్ అసిస్టెంట్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ శర్మ నివాసాలు, కార్యాలయాలపై లోకాయుక్త ప్రత్యేక పోలీసు విభాగం నిర్వహించిన మెరుపు సోదాల్లో కళ్లు చెదిరే స్థాయిలో అక్రమాస్తులు వెలుగుచూశాయి. ఇప్పటివరకు జరిపిన తనిఖీల్లో సుమారు రూ.7.60 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను అధికారులు గుర్తించారు. ఆయన తెలిసిన ఆదాయ వనరులతో పోలిస్తే ఈ ఆస్తులు ఏకంగా 560 శాతం అధికంగా ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
మూడు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారంటూ అందిన పక్కా ఫిర్యాదుల మేరకు లోకాయుక్త అధికారులు సంజీవ్ కుమార్ శర్మపై కేసు నమోదు చేశారు. నర్మదాపురం ప్రత్యేక న్యాయస్థానం నుంచి అనుమతి పొందిన అనంతరం శనివారం ఉదయం సుమారు 7 గంటల సమయంలో భోపాల్ లోకాయుక్త ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. పచ్మఢిలోని ఆయన ప్రభుత్వ నివాసం, కార్యాలయంతో పాటు ఛింద్వారాలోని ప్రైవేటు నివాసంలో ఏకకాలంలో సోదాలు ప్రారంభించాయి. ఈ తనిఖీల్లో భారీ ఎత్తున నగదు, బంగారంతో పాటు ఖరీదైన ఆస్తుల పత్రాలు లభ్యమయ్యాయి.
బంగారం, నగదు చూసి విస్తుపోయిన అధికారులు
సోదాల్లో భాగంగా రూ.26.36 లక్షల నగదు, సుమారు 2.528 కిలోల బంగారు ఆభరణాలు, 1.656 కిలోల వెండి వస్తువులను లోకాయుక్త బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. పట్టుబడిన బంగారం విలువ సుమారు రూ.3.50 కోట్లుగా, వెండి విలువ రూ.2.94 లక్షలుగా అంచనా వేశారు. ఒక్క పచ్మఢిలోని ప్రభుత్వ నివాసంలోనే రూ.23.35 లక్షల నగదు, 1.6 కిలోల బంగారం, 1.3 కిలోల వెండి బయటపడగా, ఛింద్వారా నివాసంలో మరో రూ.3.01 లక్షల నగదు, 927 గ్రాముల బంగారం, 356 గ్రాముల వెండి లభించాయి. వీటితో పాటు తాళం వేసి ఉన్న రెండు అల్మారాలను కూడా అధికారులు గుర్తించారు. వాటి తాళాలు సదరు అధికారి వద్దే ఉన్నట్లు సమాచారం.
రూ.3 కోట్ల విలువైన రెండు రిసార్టులు.. 28 భూపత్రాలు
సంజీవ్ కుమార్ శర్మకు చెందిన రెండు విలాసవంతమైన పర్యాటక ఆస్తులు అధికారుల తనిఖీల్లో బయటపడ్డాయి. మట్కులిలోని ‘ఈకోటెల్ హోటల్ అండ్ రిసార్ట్’ విలువ సుమారు రూ.2 కోట్లుగా, పచ్మఢిలోని ‘సెరినిటీ ది విల్లా’ విలువ సుమారు రూ.1 కోట్లుగా ప్రాథమికంగా లెక్కగట్టారు. వీటితో పాటు భూముల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన 28 దస్తావేజులు, ఒప్పంద పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మహీంద్రా స్కార్పియో, మహీంద్రా కేయూవీ, రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, స్కూటర్ సహా రూ.31.20 లక్షల విలువైన నాలుగు వాహనాలను, ఇంట్లోని సుమారు రూ.50 లక్షల విలువైన ఖరీదైన గృహోపకరణాలను గుర్తించారు. ఛింద్వారా, హోషంగాబాద్ ప్రాంతాల్లోని మరికొన్ని స్థలాలు, దుకాణాల వివరాలపైనా ఆరా తీస్తున్నారు.
మరింత పెరగనున్న ఆస్తుల విలువ
తొలుత నిర్వహించిన ప్రాథమిక విచారణలో ఆయన ఆస్తులు ఆదాయం కంటే 228 శాతం అధికంగా ఉన్నట్లు భావించగా, తాజా సోదాలతో ఈ వ్యత్యాసం 560 శాతానికి చేరింది. ఆయన భార్య, మరికొందరు సన్నిహితుల పేర్లతోనూ బినామీ ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో ఆ కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన అధికారులు, ఆయన బ్యాంకు ఖాతాలు, పెట్టుబడులు, ఇతర ఆర్థిక లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆస్తుల తుది మదింపు పూర్తయితే అక్రమాస్తుల విలువ మరింత భారీగా పెరిగే అవకాశం ఉందని లోకాయుక్త వర్గాలు వెల్లడించాయి.