Mahaa Daily Exclusive

  పెద్ద కలలు కనండి.. పట్టుదలతో సాధించండి!

Share

* పెద్ద కలలు కనండి.. పట్టుదలతో సాధించండి!
* రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా బాలల దినోత్సవం.
* విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించిన రాష్ట్రపతి.
ఢిల్లీ, మహా.
బాలల దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చిన్నారులతో ఎంతో ఆప్యాయంగా ముచ్చటించారు. శనివారం దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ కల్చరల్‌ సెంటర్‌లో వివిధ పాఠశాలలు, విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులను కలుసుకున్న ఆమె.. జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని సాధించేందుకు అంకితభావం, నిబద్ధతతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల అభిరుచులు, భవిష్యత్‌ ఆశయాలను రాష్ట్రపతి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పిల్లలు పెద్ద కలలు కనాలని, వాటిని నిజం చేసుకునేందుకు పట్టుదలతో ముందుకు సాగాలని ప్రోత్సహించారు. కఠోర శ్రమ, నిబద్ధత తోడైతే ఎలాంటి లక్ష్యాన్నైనా సులువుగా చేరుకోవచ్చని దిశానిర్దేశం చేశారు. చిన్నారులతో రాష్ట్రపతి గడిపిన ఈ మధుర క్షణాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
వికసిత భారత్‌ నిర్మాతలు నేటి చిన్నారులే
బాలల దినోత్సవం సందర్భంగా కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్‌ సింగ్‌ చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపారు. నేటి పిల్లలే భవిష్యత్తులో ‘వికసిత భారత్‌’ను నిర్మించే కీలక శక్తులని ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొన్నారు. చిన్నారుల్లో సహజమైన జిజ్ఞాసను పెంపొందించడం, నాణ్యమైన విద్యను అందించడం, వారు ఉన్నత శిఖరాలను అధిరోహించేలా తగిన అవకాశాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యతని స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు
భారత తొలి ప్రధానమంత్రి పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ఏటా నవంబర్‌ 14న దేశవ్యాప్తంగా బాలల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1889 నవంబర్‌ 14న ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జన్మించిన నెహ్రూకు పిల్లలంటే అమితమైన ప్రేమ ఉండేది. అందుకే చిన్నారులు ఆయనను ‘చాచా నెహ్రూ’ అని ఆప్యాయంగా పిలుచుకునేవారు. 1964లో ఆయన మరణానంతరం నవంబర్‌ 14ను అధికారికంగా బాలల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులకు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహంగా నిర్వహించారు.