Mahaa Daily Exclusive

  మేకెదాటుపై కాంగ్రెస్‌లోనే ముసలం!

Share

మేకెదాటుపై కాంగ్రెస్‌లోనే ముసలం!
* తమిళనాడు రైతుల ప్రయోజనాలే ముఖ్యం.
* ప్రాజెక్టుకు అనుమతులివ్వొద్దని కేంద్రానికి విజ్ఞప్తి
* డీకే శివకుమార్‌కు మాణిక్యం ఠాగూర్‌ ఎదురుదెబ్బ.
చెన్నై, మహా.
కావేరి నదిపై కర్ణాటక ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలనుకుంటున్న మేకెదాటు ప్రాజెక్టు వ్యవహారం కాంగ్రెస్‌ పార్టీలోనే తీవ్ర విభేదాలకు దారితీసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం గట్టిగా పట్టుబడుతున్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ (టీఎన్‌సీసీ) అధ్యక్షుడు మాణిక్యం ఠాగూర్‌ గట్టి ఎదురుదెబ్బ తగిలించారు. తమిళనాడు రైతుల ప్రయోజనాలను పక్కనపెట్టి మేకెదాటు ప్రాజెక్టు నిర్మాణం కోసం డీకే శివకుమార్‌ ఏకపక్షంగా వ్యవహరించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ మేరకు శనివారం ‘ఎక్స్‌’ వేదికగా తన తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేశారు. తమిళనాడు సమ్మతి లేకుండా ప్రాజెక్టుకు కేంద్రం తుది ఆమోదం ఇవ్వకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే ప్రయత్నాలు జరిగితే ఎంతవరకైనా పోరాడతామని ఆయన హెచ్చరించారు.
డీకే వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం
మైసూరులో శుక్రవారం (నవంబర్‌ 13న) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న కార్యక్రమంలో డీకే శివకుమార్‌ మేకెదాటు ప్రాజెక్టు అంశాన్ని ప్రస్తావించారు. కావేరి నదిపై ప్రతిపాదించిన సమతుల్య జలాశయ నిర్మాణానికి సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టత ఇచ్చిందని, ప్రాజెక్టును ఎవరూ అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న అటవీ, పర్యావరణ అనుమతులను త్వరగా మంజూరు చేయాలని కోరారు. ఈ వ్యాఖ్యలపైనే మాణిక్యం ఠాగూర్‌ తీవ్రంగా స్పందించారు. డీకే వ్యాఖ్యలు సుప్రీంకోర్టు ఆదేశాలకు, కావేరి జల వివాదాల ట్రైబ్యునల్‌ తుది తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని విమర్శించారు. దిగువ పరివాహక రాష్ట్రంగా తమిళనాడుకు ఉన్న హక్కులను విస్మరించి కర్ణాటక ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.
తమిళనాడు రైతుల జీవనోపాధికి ముప్పు
మేకెదాటు ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేస్తే తమిళనాడులోని కావేరి డెల్టా ప్రాంత రైతుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని మాణిక్యం ఠాగూర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కావేరి జలాల పంపిణీ విషయంలో ఇప్పటికే నిర్ణయించిన రాష్ట్రాల హక్కులను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. దిగువ పరివాహక రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రాజెక్టుకు ఆమోదం తెలపకూడదని స్పష్టం చేశారు. తమిళనాడు అనుమతి లేకుండా ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపడం మరిన్ని న్యాయపరమైన చిక్కులకు దారితీస్తుందని పేర్కొన్నారు.
బెంగళూరు తాగునీటి అవసరాల పేరుతో..
కర్ణాటకలోని కనకపుర సమీపంలో కావేరి నదిపై మేకెదాటు వద్ద భారీ సమతుల్య జలాశయాన్ని నిర్మించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. బెంగళూరు నగరానికి తాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు కరువు పరిస్థితుల్లో నీటిని నిల్వ చేసుకునేందుకు, విద్యుదుత్పత్తికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని కర్ణాటక చెబుతోంది. అయితే జలాశయం నిర్మాణం వల్ల కావేరి సహజ నీటి ప్రవాహానికి అడ్డంకి ఏర్పడుతుందని, తమకు రావాల్సిన నీటి వాటా విషయంలో తీవ్ర నష్టం జరుగుతుందని తమిళనాడు మొదటి నుంచీ వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ఒకే జాతీయ పార్టీకి చెందిన రెండు రాష్ట్రాల ముఖ్య నేతల మధ్య ఈ అంశంపై బహిరంగంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.