Mahaa Daily Exclusive

  కొత్తగూడెం ఎయిర్ పోర్టుకు గ్రీన్ సిగ్నల్ !

Share

  • కొత్తగూడెం ఎయిర్ పోర్టుకు గ్రీన్ సిగ్నల్ !
  • సుజాతనగర్‌ వద్ద 667 ఎకరాల్లో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు ఆమోదం
  • ఆరు ప్రాంతాల్లో సర్వే నిర్వహించి తుది ఎంపిక
  • భూసేకరణ, ఇతర అనుమతులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి

కొత్తగూడెం, మహా : రాష్ట్రంలో మరో విమానాశ్రయం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర విమానయాన శాఖ పచ్చజెండా ఊపింది. జిల్లాలోని సుజాతనగర్‌ వద్ద సుమారు 667 ఎకరాల విస్తీర్ణంలో ఎయిర్‌పోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కేంద్రం నుంచి ఆమోదం లభించడంతో కొత్తగూడెం ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలన్న ఏళ్లనాటి కల సాకారమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి.

ఆరు ప్రాంతాల్లో సర్వేలు

కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని గుర్తించేందుకు అధికారులు ఆరు ప్రాంతాల్లో సర్వేలు నిర్వహించారు. పెనగడప, పాల్వంచ–దమ్మపేట, చాపరాలపల్లి, దుమ్ముగూడెం, సుజాతనగర్‌, సీతంపేట ప్రాంతాలను పరిశీలించారు. విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన భూమి లభ్యతతో పాటు రన్‌వే ఏర్పాటుకు అనుకూలత, ప్రాంతం ఎత్తు, చుట్టుపక్కల ఉన్న అటవీ ప్రాంతాలు, వరదల ముప్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం సుజాతనగర్‌ ప్రాంతం విమానాశ్రయ ఏర్పాటుకు అనువుగా ఉంటుందని తుది నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

ప్రధాన ప్రాంతాలకు సమీపంలోనే…

ప్రతిపాదిత విమానాశ్రయ ప్రాంతం నుంచి ప్రధాన రహదారి 3.4 కిలోమీటర్లు, కొత్తగూడెం రైల్వే స్టేషన్‌ 5.7 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. భద్రాచలం 35.4 కిలోమీటర్లు, సింగరేణి ప్రాంతం 32.3 కిలోమీటర్ల దూరంలో ఉండనున్నాయి. సమీపంలోని అభయారణ్యం 7.4 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు సర్వే నివేదికలో పేర్కొన్నారు. ఈ ప్రాంతం నుంచి వివిధ రవాణా మార్గాలకు ఉన్న దూరాన్ని కూడా అధికారులు పరిశీలించారు.

వరదల ముప్పుపైనా అధ్యయనం…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గతంలో సంభవించిన భారీ వరదలను దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదిత ప్రాంతంలో వరదల ప్రభావంపై కూడా అధ్యయనం చేశారు. 1986లో తీవ్ర వరదలు వచ్చిన ప్రాంతానికి సుజాతనగర్‌ 23.1 కిలోమీటర్ల దూరంలో ఉండగా, 2022లో భారీ వరదలు సంభవించిన ప్రాంతానికి 25.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు సర్వే నివేదికల్లో పేర్కొన్నారు. విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి భద్రత, భౌగోళిక పరిస్థితులు, ఇతర అనుకూలతలను పరిశీలించిన అనంతరమే సుజాతనగర్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

భూసేకరణపై తదుపరి చర్యలు…

కేంద్రం నుంచి అనుమతి లభించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తదుపరి కార్యాచరణపై దృష్టి సారించనుంది. ప్రతిపాదిత 667 ఎకరాల భూసేకరణతో పాటు ఇతర అనుమతులు, నిర్మాణానికి సంబంధించిన అంశాలపై చర్యలు చేపట్టాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయితే కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయ నిర్మాణానికి మరింత స్పష్టత రానుంది.

ఇప్పటికే రాష్ట్రంలో వరంగల్‌ మామునూరు, ఆదిలాబాద్‌ విమానాశ్రయాల పనులు ప్రారంభమయ్యాయి. తాజాగా కొత్తగూడెం ఎయిర్‌పోర్టుకు కూడా మార్గం సుగమం కావడంతో రాష్ట్రంలో విమానయాన రంగం మరింత విస్తరించే అవకాశం ఏర్పడింది. శంషాబాద్‌, బేగంపేట విమానాశ్రయాలతో కలిపి కొత్తగూడెం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే రాష్ట్రంలోని విమానాశ్రయాల సంఖ్య ఐదుకు చేరనుంది.