స్థానిక ఎన్నికలకు జనసేన కసరత్తు వేగవంతం.
• 2 కార్పొరేషన్లు, 3 మున్సిపాలిటీలకు అభ్యర్థుల ఖరారు.
అమరావతి, మహా.
ఆంధ్రప్రదేశ్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ సన్నద్ధతను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 2 కార్పొరేషన్లు, 3 మున్సిపాలిటీలకు మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల పేర్లను పార్టీ అధిష్టానం ఖరారు చేసినట్లు ప్రకటించింది. శ్రీకాకుళం కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా డాక్టర్ దానేటి రాధారాణి, కాకినాడ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా ఆకుల భవానిని ఖరారు చేశారు. భీమవరం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ చుండూరి మల్లేశ్వరి, తాడేపల్లి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పాలురు వెంకటేశ్వరరావు, రాజాం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా బనిశెట్టి సౌజన్యలత పేర్లను ప్రకటించారు.
ఈ ఐదు స్థానాలకు అభ్యర్థుల పేర్లు ఖరారు కావడంతో ఆయా ప్రాంతాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో చర్చ మొదలైంది. అభ్యర్థుల ఎంపికపై జనసేన నాయకులు హర్షం వ్యక్తం చేసినట్లు సమాచారం. మిగిలిన స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికపై కూడా పార్టీ కసరత్తు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే తదుపరి జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది.








