Mahaa Daily Exclusive

  సినీ నటి అనితకు కుచ్చుటోపి…

Share

  • సినీ నటి అనితకు కుచ్చుటోపి
  • రూ.4.14 లక్షలు కొట్టేసిన సైబర్‌ కేటుగాళ్లు..
  • బిజినెస్‌ క్లాస్‌ బుకింగ్‌ అంటూ మోసం
  • ఓటీపీ చెప్పడంతో ఖాతా నుంచి నగదు మాయం
  • సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్‌, మహా : తక్కువ ధరకే విమాన టికెట్లు బుక్‌ చేస్తామంటూ నమ్మించిన సైబర్‌ కేటుగాళ్లు సినీ నటి గోగినేని అనిత (అనితా చౌదరి)ను మోసగించారు. బిజినెస్‌ క్లాస్‌ టికెట్లు బుక్‌ చేస్తామని చెప్పి ఆమె బ్యాంకు ఖాతా నుంచి ఏకంగా రూ.4,14,180 కాజేశారు. టికెట్‌ కన్ఫర్మేషన్‌ రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని మాదాపూర్‌ కావూరి హిల్స్‌లో నివసించే నటి అనిత, అమెరికాలోని వాషింగ్టన్‌లో ఉంటున్న తన కుమారుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం విమాన టికెట్లు బుక్‌ చేసుకునేందుకు నవంబర్‌ 12న ఆన్‌లైన్‌లో ట్రావెల్‌ ఏజెన్సీల కోసం వెతికారు. ఈ క్రమంలో ‘లో ఫ్లై టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌’ పేరుతో రాజేశ్‌ అనే వ్యక్తి ఆమెను సంప్రదించాడు.

వాషింగ్టన్‌ ప్రయాణానికి తమ వద్ద తక్కువ ధరకే బిజినెస్‌ క్లాస్‌ టికెట్లు అందుబాటులో ఉన్నాయని రాజేశ్‌ నమ్మబలికాడు. రౌండ్‌ ట్రిప్‌ టికెట్‌కు రూ.4,14,180 ఖర్చవుతుందని చెప్పాడు. బుకింగ్‌ ప్రక్రియ కోసం డెబిట్‌ కార్డు వివరాలు ఇవ్వాలని కోరడంతో అనిత అతడిని నమ్మి తన కార్డు వివరాలను అందించారు. టికెట్‌ ప్రాసెసింగ్‌ కోసమంటూ ఆమె మొబైల్‌ ఫోన్‌కు వచ్చిన ఓటీపీలను కూడా నిందితుడు అడిగి తెలుసుకున్నాడు. అనిత ఓటీపీ చెప్పిన వెంటనే క్లియర్‌ట్రిప్‌ ద్వారా ఆమె ఖాతా నుంచి రూ.4,14,180 డెబిట్‌ అయ్యాయి. అయితే, డబ్బులు కట్‌ అయినప్పటికీ టికెట్‌ కన్ఫర్మేషన్‌ రాలేదు. ఎంతసేపటికీ టికెట్‌ వివరాలు అందకపోవడంతో పాటు రాజేశ్‌ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తాను మోసపోయినట్లు ఆమె గుర్తించారు.

దీంతో బాధితురాలు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు రాజేశ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆన్‌లైన్‌లో ట్రావెల్‌ ఏజెన్సీలను సంప్రదించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. డెబిట్‌, క్రెడిట్‌ కార్డు వివరాలు, ఓటీపీలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించారు.